అవును.. ఆ పెద్దాయనకు కోపం వచ్చింది.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వెన్నంటే ఉన్న తనకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదని గుర్రుగా ఉన్నారు. ఇన్నేళ్లు పార్టీకి సేవ చేస్తే.. తనకు దక్కిందేమిటని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. నేను నోరు విప్పితే ఏం జరుగుతుందో తెలుసా అని మీడియా ప్రతినిధుల ఎదుట ఆక్రోశం వెళ్లగక్కే స్థాయికి చేరుకున్నాడంటే.. ఆయనలో అసహనం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతుంది. హ్యాట్రిక్ గెలుపు సాధించినా కూడా ఆ సీనియర్ నేతను అధినేత ఎందుకు పక్కన పెట్టారు… ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది…
Also Read : ఏపీ జనసేన అధ్యక్షుడు కూడా త్వరలోనే
గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. వ్యాపార రంగంలోకి వచ్చినా కూడా కమ్యూనిస్టు పార్టీలకు ఆర్థికంగా సహాయం చేస్తూ వచ్చారు. అయితే 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన మొదటి వ్యక్తి బుచ్చయ్య సోదరుడు రాజేంద్ర ప్రసాద్. తొలి రోజుల్లోనే రాజమండ్రిలో టీడీపీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. అన్న పిలుపు మేరకు ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరారు బుచ్చయ్య చౌదరి. ఎన్నికల వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ కన్వీనర్‌గా వ్యవహరించారు.
1983లో అనూహ్యంగా రాజమండ్రి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి బుచ్చయ్య చౌదరి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1985లో రెండోసారి గెలిచిన బుచ్చయ్యను మంత్రివర్గంలో కాకుండా.. పార్టీ కార్యక్రమాలకే ఎక్కువగా వినియోగించారు ఎన్టీఆర్. 1989 ఎన్నికల్లో ఓడినప్పటికీ.. నాటి కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. 1994లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుచ్చయ్యను మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఎన్టీఆర్. అయితే 1995 సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ వైపు నిలిచిన బుచ్చయ్య… చంద్రబాబును వ్యతిరేకించారు. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి వ్యవహార శైలి నచ్చకపోవడంతో కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
Also Read : ముందు ఆ విషయం పై క్లారిటీ ఏదీ..?
1997లో చంద్రబాబు ఆహ్వానం మేరకు టీడీపీలోకి వచ్చిన బుచ్చయ్య.. 1999లో నాలుగోసారి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఓడినప్పటికీ.. 2014 రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. పార్టీలో సీనియర్‌గా తనకు మంత్రివర్గంలో అవకాశం వస్తుందని గోరంట్ల గంపెడాశ పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం బుచ్చయ్యకు అవకాశం ఇవ్వలేదు. దీంతో పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేశారు. 2021లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఉదాసీన వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అయితే స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి మాట్లాడటంతో తన రాజీనామా విరమించుకున్నారు.
రాజకీయాల్లో చివరి దశలో ఉన్న తనను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనను కాదని కొత్తగా వచ్చిన వారికి కూడా పదవులు ఇస్తారన్నారు. తాను ఏ రోజు పార్టీ లైన్ దాటి పోలేదని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అండతో.. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తనపై పెత్తనం చేసేందుకు యత్నిస్తున్నారని ఇటీవల అధినేతకు స్వయంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సిటీ పరిధిలోని తన వర్గం నేతలను పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవటం లేదన్నారు. వైసీపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని ఆదిరెడ్డి వాసుపై గోరంట్ల ఫిర్యాదు చేశారు. చివరికి రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో పనుల విషయంలో కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన నేతలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని లేఖలో ప్రస్తావించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
Also Read : రష్యా స్నేహం ఇండియాను ముంచుతుందా..? ట్రంప్ సంచలన బిల్..!
పార్టీలో సీనియర్ నేత, అందరిని సమన్వయం చేసుకునే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ఫిర్యాదు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ హవాలో కూడా గెలిచిన నేతగా గోరంట్లపై ప్రతి ఒక్కరికీ అభిమానం. వాస్తవానికి నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా ఆయన వర్గానికి న్యాయం జరగలేదు అనేది బహిరంగ రహస్యం. ఒకరిద్దరు నేతలకు పదవులు వచ్చినప్పటికీ.. వాటిని ఆ నేతలు తిరస్కరించారు. చేసిన కష్టానికి సరైన గుర్తింపు దక్కనందుకే పదవులను నేతలు తిరస్కరించారు. అయినా సరే.. ఆ నేతలతో పార్టీ పెద్దలు ఇప్పటి వరకు కనీసం చర్చించలేదు. ఇది కూడా గోరంట్ల అసహనానికి ప్రధాన కారణం. మరి ఈ పెద్దాయనను అధినేత ఎలా బుజ్జగిస్తారో చూడాలి.

