జగన్ గొప్ప నాయకుడు.. నిత్యం ప్రజల మంచి గురించే ఆలోచిస్తారు.. ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేశారు.. ఇవే ప్రతి రోజు.. ప్రతి క్షణం వైసీపీ నేతలు చెప్పే మాటలు. కూటమ ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని.. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోందని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. జీతం తీసుకోలేదు.. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఇక రెండు రోజుల క్రితం సొంత మీడియాలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో 3 పార్టీలు మారిన జూపూడి ప్రభాకర్ అయితే.. అబ్బో.. కన్నీరు కూడా పెట్టుకున్నారు. జగన్ రోజుకు 6 గంటలు కూడా సరిగ్గా నిద్ర పోరని.. రోజుకు 20 గంటల పాటు ప్రజల గురించే ఆలోచిస్తారని.. ఆయన మానవత్వం ఎవరికీ రాదన్నారు. అలాంటి జగన్‌పై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని కూడా జూపూడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వాహనం కింద సింగయ్య అనే కార్యకర్త పడిన వీడియో ఏఐ ద్వారా చేసిందన్నారు కూడా.
Also Read : చంద్రబాబు, పవన్ అభిప్రాయం తర్వాతే బిజెపి ఆ నిర్ణయం..?
ఇక అమరావతి కోసం కూటమి కోసం ఖర్చు చేస్తుందంతా బూడిదలో పోసిన పన్నీరే అని మరో వైసీపీ నేత వెంకటరెడ్డి అదే పనిగా సాక్షిడిబేట్‌లో ఆరోపణలు చేస్తున్నారు. మహానాడు కడపలో ఎందుకు పెట్టారు.. అమరావతిలో ఎందుకు పెట్టలేదు అంటే.. అమరావతిలో పెడితే.. కార్యకర్తలు రావడానికి బోట్లు కావాలని వెటకారం వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక యోగాంధ్ర పేరుతో 300 కోట్లు అనవసరంగా ఖర్చు చేశారని ఎక్కడో విదేశాల్లో కూర్చున్న వైసీపీ సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు కూడా తెగ గోల చేస్తున్నారు. అసలు యోగాంధ్రకు 300 కోట్లు ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలని వారం రోజులుగా సోషల్ మీడియాలో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక చంద్రబాబు ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కోసం జిల్లాల్లో ఎందుకు పర్యటిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ పర్యటన కోసం కోట్లు ఖర్చవుతున్నాయంటున్నారు. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం కోసం కొత్తగా హెలికాఫ్టర్లు కొనుగోలు చేస్తున్నారని కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై పరువు నష్టం దావా వేస్తానంటూ మంత్రి నారా లోకేష్ హెచ్చరించడంతో ఆ విషయంపై సైలెంట్ అయ్యారు.
Also Read : విలువలు, విశ్వసనీయతలో ఎప్పుడూ రాజీపదలేదన్న జగన్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా?
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విశాఖలోని రిషికొండపైన జగన్ ప్యాలెస్ నిర్మించారు. పర్యాటక శాఖ నిధులతో సీఎం క్యాంపు ఆఫీసు, సీఎం అధికారికి నివాసం అంటూ రెండు భారీ భవనాలు నిర్మించారు. సకల సౌకర్యాలతో ఈ రెండు భవనాలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ భవనాల వైపు వెళ్లకుండా నాటి మాజీ సీఎం చంద్రబాబును కూడా అడ్డుకున్నారు పోలీసులు. అనుమతి లేకుండా అటు వైపు వెళ్లడానికి లేదన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భవనాలను బయటి ప్రపంచానికి చూపించారు గాజువాక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అత్యంత విలాసవంతంగా, ఖరీదైన విదేశీ వస్తువులతో ఈ భవనాలు నిర్మించారు. బీచ్ వ్యూ తో బాత్ రూమ్, ఖరీదైన భోజనం టేబులు, బెడ్.. ఇలా ఒకటేమిటి.. మ్యాట్ మొదలు.. ఫ్యాన్ వరకు అన్నీ ఖరీదైనవే. ఇదేమిటని ప్రశ్నిస్తే.. అవి ప్రభుత్వ భవనాలే కదా.. కాబట్టి దుర్వినియోగం ఎలా అవుతుంది అని ఎదురు ప్రశ్నించారు వైసీపీ నేతలు.
Also Read : ఏపీ జనసేన అధ్యక్షుడు కూడా త్వరలోనే
అయితే తాజాగా జగన్ అధికార దుర్వినియోగం లెక్కలతో సహా వెలుగులోకి వచ్చింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ప్రజాధనం ఏ రేంజ్‌లో దుర్వినియోగం చేశారో లెక్కలతో సహా బయటపడింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. సరిగ్గా 27 రోజులకే ఓ జీవో విడుదల చేశారు. అది పూర్తిగా ఆయన సొంత ఇంటి భద్రత కోసం మాత్రమే. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర హెలిప్యాడ్ నిర్మాణం, దాని చుట్టూ ఫెన్సింగ్, అక్కడికి అప్రోచ్ రోడ్డు వేయడానికి 40 లక్షలు కేటాయించారు. ఇక తాడేపల్లి ప్యాలెస్‌కు చుట్టూ శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్‌తో గ్రిల్స్ పెట్టడానికి ఏకంగా 75 లక్షలు ఖర్చు చేశారు. ఇక హెలిప్యాడ్ దగ్గర గార్డ్ రూమ్, టాయిలెట్ కోసం 13.50 లక్షలు, తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పోలీస్ బ్యారెక్, టాయిలెట్ కోసం 30 లక్షలు ఖర్చు చేశారు. ప్యాలెస్ దగ్గర 31 లక్షలతో సెక్యూరిటీ పోస్టు నిర్మించారు. అంటే మొత్తం కోటీ 89.50 లక్షలను ప్యాలెస్ దగ్గర తన సెక్యూరిటీ కోసం జగన్ ఖర్చు చేశారు.
సాధారణంగా సొంత ఇంటికి ఖర్చు చేస్తే.. వాటిని ఆయా నేతల అకౌంట్ నుంచే డ్రా చేస్తారు. కానీ ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ మాత్రం.. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ శాశ్వతంగా ఉండేలా ఐరన్ గ్రిల్స్, సీసీ కెమెరాలు, టాయిలెట్లకు కూడా ప్రభుత్వ సొమ్మునే వినియోగించారు. మాజీ సీఎం ఇంటికి ప్రభుత్వ సొమ్ముతో సెక్యూరిటీ ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే మాత్రం.. వైసీపీ నేతలు నో ఆన్సర్. 2019 జూన్ 26వ తేదీన ఇచ్చిన జీవో నంబర్ 133 ఇప్పుడు బయటకు రావడంతో.. ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కోట్ల రూపాయలను జగన్ నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.