ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ ఓటమి తర్వాత చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. మరికొందరు సైలెంట్ అయ్యారు. అయితే ఇలా మౌనం పాటించిన చాలామంది నేతలు ఇటీవల తిరిగి యాక్టివ్ అవుతున్నారు. కానీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాడ ఎక్కడా కనిపించటం లేదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస ఆందోళనలు చేస్తోంది. ఇదే సమయంలో జగన్ చేసిన మావిగన్ రాజధాని ప్రతిపాదన నేపథ్యంలో నేతలంతా స్పందిస్తున్నారు. మరోవైపు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తీరుపై ఇటీవల వైసీపీ నేతలంతా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు కూడా. అయితే ఇంత జరుగుతున్నా అనిల్ కుమార్ యాదవ్ జాడ లేకపోవడం వైసీపీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Also Read : రోజా, బైరెడ్డిపై కేసు నమోదు..?
అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా కూడా వ్యవహరించారు. అసెంబ్లీలోనే బుల్లెట్ దిగిందా లేదా.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అయితే.. “అయ్యా పీకే.. నువ్వేం పీకలేవు..” అంటూ నోరు పారేసుకున్నారు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. బీసీ కార్డు వాడినప్పటికీ.. ఏకంగా లక్షన్నర ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఓటమి తర్వాత ఇప్పటి వరకు నరసరావుపేట పార్లమెంట్ స్థానంపై దృష్టి పెట్టలేదు. అదే సమయంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానంపై కూడా ఫోకస్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే కనీసం నెల్లూరు కూడా రావడం లేదు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ఓ నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా.. అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ కాకపోవడం ఏమిటనే ప్రశ్న ఇప్పుడు సొంత క్యాడర్‌లోనే బాగా వినిపిస్తోంది.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ 2008లో నెల్లూరు కార్పొరేషన్‌లో కార్పొరేటర్ అయ్యారు. ఆ సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2009 ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్.. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కృష్ణా రెడ్డి చేతిలో 90 ఓట్ల స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత 2012లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో అందులో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారు. వైసీపీ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు మంత్రిగా కూడా వ్యవహరించారు.2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అనిల్. నాటి నుంచి వైసీపీలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు అన్న ప్రచారం ఉంది.
Also Read : డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు షాక్..!
అయితే 2024 ఎన్నికల ప్రచారంలో అనిల్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి అనిల్‌కు నెల్లూరు సిటీ నియోజకవర్గం వదిలిపెట్టడం ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ జగన్ మాత్రం బలవంతంగా నరసరావుపేటకు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన నేత కావటంతో పల్నాడు ప్రజలు అనిల్‌కు సొంతం చేసుకోలేదు. అదే సమయంలో తాను ఓడిపోతే.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తా అంటూ సవాల్ కూడా చేశారు అనిల్. అలాగే భవష్యత్తులో నరసరావుపేటలోనే ఇల్లు కట్టుకుంటా అని పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పారు. అయితే ఓడిన తర్వాత మళ్లీ నరసరావుపేట వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తాజాగా వైసీపీ అధినేతకు కూడా అనిల్ అందుబాటులోకి రావడం లేదనే మాట బాగా వినిపిస్తోంది. దీంతో అనిల్ తీరుపై పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

