భారత క్రికెట్‌లో మరో అద్భుత ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ప్రకటించిన టీ20 జట్టులో అతనికి అవకాశం కల్పించడంతో భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. చిన్న వయసులోనే అసాధారణ బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించిన వైభవ్, ఇటీవల అండర్-19 స్థాయిలోనే కాకుండా దేశీయ, ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని దూకుడు బ్యాటింగ్, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, మ్యాచ్‌ను మలుపుతిప్పే నైపుణ్యం సెలెక్టర్లను ఆకట్టుకున్నాయి.
Also Read : ఏఐ టెక్నాలజీ.. రికార్డు నెలకొల్పిన టీటీడీ..!
భారత ప్రధాన ఎంపిక కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, “వైభవ్ ప్రదర్శనలు అతడిని ఎంపిక చేయకుండా ఉండే అవకాశం ఇవ్వలేదు” అని పేర్కొనడం ఈ బుడ్డోడి దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ వ్యాఖ్య అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. 15 సంవత్సరాల వయసులో భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడం ద్వారా వైభవ్ అరుదైన ఘనత సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు. అతడు అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తే మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.
ఇటీవలి అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయానికి వైభవ్ కీలక పాత్ర పోషించాడు. టోర్నమెంట్ మొత్తం అతని ప్రదర్శన సెలెక్టర్లను ఆకట్టుకుంది. అనంతరం ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ మెరుపు ఇన్నింగ్స్‌లతో తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. భారత క్రికెట్‌లో కొత్త తరం ఆటగాళ్లకు అవకాశాలు కల్పించే క్రమంలో వైభవ్ ఎంపిక కీలక మైలురాయిగా భావిస్తున్నారు. అతని ప్రతిభను సరైన విధంగా తీర్చిదిద్దగలిగితే, రాబోయే సంవత్సరాల్లో టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read : మద్యం కుంభకోణం.. వైఎస్ జగన్‌కు ఈడీ నోటీసులా..?
ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వైభవ్ అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టు పిలుపు అందుకున్న ఈ యువ సంచలనం భారత క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

