Friday, July 31, 2026 09:37 PM
Friday, July 31, 2026 09:37 PM

భోగాపురం భోగం ఎవరిది.. క్రెడిట్ ఎవరిది..?

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామారాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ప్రారంభం కానుంది. ఆగస్టు 17వ తేదీన తొలి అంతర్జాతీయ విమానం భోగాపురం రానుంది. రికార్డు సమయంలో భోగాపురం విమానాశ్రయాన్ని కూటమి సర్కార్ పూర్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం కానుంది. భోగాపురం వైభోగం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోనుంది. అయితే ఇక్కడే ఓ విషయంపై తెలుగుదేశం, వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది. అదే క్రెడిట్ వార్. భోగాపురం తమ వల్లే అని కూటమి సర్కార్ నేతలు, టీడీపీ నేతలు బలంగా చెబుతుంటే.. మా అన్న వల్లే అంటున్నారు వైసీపీ నేతలు. అటు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా.. తన వల్లే భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వచ్చిందని స్వయంగా ప్రకటించుకున్నారు.

Also Read : భోగాపురం.. మూడు రాష్ట్రాల పవర్‌ హౌస్‌

అయితే తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్లంలో తీవ్ర వేధింపులతో పాటు సస్పెన్షన్‌కు గురై.. చివరికి న్యాయపోరాటంతో తన పదవి దక్కించుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌ పదవి కూడా ఇచ్చారు. అయితే ఏబీవీ మాత్రం ఆ పదవి కేటాయింపుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ పదవి నాకు వద్దు అంటూ ప్రకటించిన ఏబీవీ.. అప్పటి నుంచి కూటమి సర్కార్ పైన యుద్ధం ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఏబీవీ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అదే “భోగాపురం క్రెడిట్ ఎవరిది?..” అంటూ మొదలుపెట్టారు. క్రెడిట్ కోసం కొట్టుకోవడం ఆపండి… ఆ క్రెడిట్ జీఎంఆర్‌ది అని వ్యాఖ్యానించారు. వాస్తవాలివీ.. అంటూ వివరాలు రాసుకుంటూ వచ్చారు. “అవసరమైన దాని కంటే చాలా ఎక్కువగా 5000 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్లు వాస్తవం.. భూములు కోల్పోయే వాళ్ల ఆందోళనలు వాస్తవం.. ఆ ఆందోళనలకు అప్పట్లో ప్రతిపక్షం సమర్థన వాస్తవం.. బలవంతాన, అతి కష్టం మీద భూమి పరిమితిని దాదాపు 3000 ఎకరాలకు కుదించడం వాస్తవం.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వేలం ద్వారా బిడ్లు ఆహ్వానించడం వాస్తవం.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బిడ్డు గెలుచుకోవడం వాస్తవం.. జీఎంఆర్ కోసం ఆ వేలాన్ని క్యాన్సిల్ చేయడం వాస్తవం.. (అప్పట్లో పౌర విమాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గారు. బలవంతాన ఒప్పుకున్నారు).. వేలం నిబంధనలని సవరించి తిరిగి వేలం వెయ్యడం, ముందుగానే ‘నిర్ణయించిన’ ప్రకారం జీఎంఆర్‌కు అప్పజెప్పడం వాస్తవం.

Also Read : వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు.. లోకేష్ మాస్ వార్నింగ్..!

“మొదలయ్యిన పనులను జగన్ ప్రభుత్వం ఆపుజేయించడం వాస్తవం.. కాకినాడ ఎస్ఈజెడ్‌లో జీఎంఆర్ వాటాలను అరబిందోకు అప్పజెప్పడంతో పాటు ఇంకొన్ని ‘విషయాల్లో’ డీల్ కుదరటం వాస్తవం.. 2023లో పనులు తిరిగి ప్రారంభించడానికి ‘అనుమతించడం’ వాస్తవం.. ఇప్పటి మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరుండి పనులు వేగిరపరచడం వాస్తవం.. కావలసిన సదుపాయాలు, కనెక్టింగ్ రోడ్లకు మన పేద రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కుమ్మరించడం వాస్తవం.. బట్టల షాపింగ్ మాల్ లాంటి.. (అక్కడ కనీసం పోటీ ఉంటుంది. ఇక్కడ లాభాలు గ్యారంటీ) సంస్థ ప్రారంభానికి కోట్ల ఖర్చుతో ప్రభుత్వం హడావుడి వాస్తవం.. 13,000 మందితో ధింసా నృత్యాలు, ‘అల భోగాపురంలో’ అంటూ అస్మదీయ పత్రికల కేరింతలు వాస్తవం.. విజయవాడ ఎయిర్‌పోర్ట్ పనులు ఎక్కడివి అక్కడే, ఇన్నేళ్ళకూ డైలీ ఒక్క అంతర్జాతీయ సర్వీసు లేకపోవడం, తేకపోవడం చేదు వాస్తవం.. వాట్సాప్ యుగంలో ప్రజల జ్ఞాపక శక్తి మీద అందరికీ చులకన. అందుకే ఒక వరుసలో గుర్తు చెయ్యడం.. ఇవన్నీ రికార్డు మీదున్న వాస్తవాలే.. ఇప్పుడు నిర్ణయించుకోండి, భోగాపురం భోగం ఎవరిది, క్రెడిట్ ఎవరిది?..” అంటూ విశ్రాంత ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

జనసేనాని ఆన్ డ్యూటీ.....

జనసేనలో రాష్ట్ర అధికార ప్రతినిధుల వ్యవస్థను...

వాళ్ళను వదిలే ప్రసక్తే...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

భోగాపురం.. మూడు రాష్ట్రాల...

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో శనివారం సరికొత్త అధ్యాయం...

కృష్ణా డెల్టాకు గోదారమ్మ...

గత రెండు నెలలుగా వర్షాలు లేక...

అడ్డంగా దొరికిపోయిన కేటిఆర్..?

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా...

పోల్స్