అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం, అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాయి. యూరప్ దేశాలలో మోహరించిన అమెరికా సైనిక బలగాలను భారీ స్థాయిలో వెనక్కి రప్పించే దిశగా ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పెంటగాన్ సిద్ధం చేస్తున్న తాజా ప్రతిపాదనల ప్రకారం.. యూరప్ నుండి కేవలం సైనికులను మాత్రమే కాకుండా విమానాలు, యుద్ధ నౌకలు, మరియు భారీ ఆయుధ సంపత్తిని కూడా ఉపసంహరించుకోనున్నారు.
Also Read : ప్రిస్క్రిప్షన్ మందులపై మెడికల్ షాపుల్లో కొత్త రూల్..!
సుమారు 25,000 నుండి 40,000 మందికి పైగా అమెరికన్ సైనికులను స్వదేశానికి రప్పించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం యూరప్ అంతటా రక్షణ విధుల్లో సుమారు 68,064 మందికి పైగా అమెరికన్ సైనికులు శాశ్వతంగా మోహరించి ఉండగా, ఈ ప్రతిపాదిత కోత కారణంగా అక్కడ అమెరికా సైనిక పటాలం గణనీయంగా తగ్గనుంది. నాటో మిత్రదేశాల తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా రక్షణ బడ్జెట్ కేటాయింపుల్లో మరియు అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల్లో యూరప్ దేశాలు తమకు తగిన సహకారం అందించడం లేదని ట్రంప్ భావిస్తున్నారు.
Also Read: మరో వైసీపీ కీలక నేతకు షాక్..!
అమెరికాపైనే పూర్తి రక్షణ భారం పడుతుందనే ఉద్దేశంతోనే, వ్యూహాత్మకంగా ఈ బలగాల ఉపసంహరణకు ట్రంప్ యంత్రాంగం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా తీసుకుంటున్న ఈ ఆకస్మిక నిర్ణయం యూరప్ దేశాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సైనిక ఉపసంహరణ వల్ల యూరప్ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రష్యా దూకుడును అడ్డుకోవడం నాటో దేశాలకు కష్టతరంగా మారుతుందని మిత్రదేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయ, రక్షణ సమీకరణాలను ఎలా మార్చబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

