కడప జిల్లా రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా ఒకే కుటుంబం ఆధిపత్యంలో కొనసాగిన ఈ నియోజకవర్గంలో, తొలిసారిగా ప్రజలు ఎలాంటి భయాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్య వాతావరణం నెలకొనడంతో, ఈ ఓటింగ్ పులివెందుల రాజకీయ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : చీ.. ఇది కూడా రాజకీయమేనా.. మీరు మారరా..?
30 ఏళ్లుగా పులివెందుల అంటే YSR కుటుంబానికి కంచు కోటగా ఉంటూ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు ప్రత్యర్థులు కనీసం పోటీ ఇచ్చేందుకు కూడా వెనుకాడే పరిస్థితులు ఉండేవి. ఏకగ్రీవం కావడం లేదా ఏకపక్షంగా ముగియడం పులివెందులలో సర్వసాధారణం. అయితే కాలక్రమేణా మారుతున్న రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయిలో ప్రజల్లో వచ్చిన చైతన్యం ఈసారి స్పష్టంగా కనిపించింది. దశాబ్దాల కాలం తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర పోటీ నెలకొనడం పులివెందులలో మార్పును సూచిస్తోంది.
ఈ సారి జరిగిన ఓటింగ్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఓటర్లు తమ నిరసనను గానీ, ఆకాంక్షలను గానీ స్వేచ్ఛగా ఓటు రూపంలో వ్యక్తపరిచేందుకు మార్గం సుగమమైంది. ఇతర పార్టీలు కూడా పూర్తిస్థాయిలో శ్రేణులను సమీకరించి ప్రచారం నిర్వహించడం, పోలింగ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం వంటి పరిణామాలు పులివెందులలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కనబరిచాయి. భయపడకుండా ఓటేసేందుకు ప్రజలు చూపించిన ఉత్సాహం పులివెందుల కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికింది.
Also Read : హైదరాబాద్ కి పొంచి ఉన్న నీటి సమస్య.. తక్షణ కర్తవ్యమేంటి?
మొత్తానికి, పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో నిన్న జరిగిన పోలింగ్ కేవలం ఓ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికే పరిమితం కాలేదు. దశాబ్దాల ఏకపక్ష రాజకీయంపై ప్రజలు పొందిన స్వేచ్ఛ. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన న్యాయ నిర్ణేతలు, మార్పు అనేది అనివార్యమని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు తర్వాత రాబోయే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, 30 ఏళ్ల తర్వాత పులివెందులలో స్వేచ్ఛాయుతమైన ఓటింగ్ ప్రక్రియ జరగడం మాత్రం ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం.


