త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరుగుతాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే “సర్” ప్రక్రియ పూర్తి అయ్యింది. తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నిక అనే విషయం మరింత ఆసక్తిగా మారింది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడిందనేది బహిరంగ రహస్యం. చివరికి అభ్యర్థులు నామినేషన్ వస్తే.. రిటర్నింగ్ అధికారి కార్యాలయం బయటే.. పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల అయితే మహిళలను కొట్టి కిడ్నాప్ కూడా చేశారు. అంజిరెడ్డి తాత వంటి వారు ఎదిరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి కూడా. ఆ రేంజ్‌లో దౌర్జన్యం చేశారు కాబట్టే మొత్తం 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానాలను వైసీపీ గెలుచుకుంది.
Also Read : చంద్రబాబు మార్క్ రాజకీయం.. ఆ నేతకు బ్రేక్..!
అయితే 2024 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఆ పార్టీకి చాలా మంది సీనియర్ నేతలు గుడ్ బై చెప్పేశారు. ఉన్న వాళ్లు కూడా జగన్ చేసే మావిగన్ వంటి ప్రకటనలతో తికమకకు గురవుతున్నారు. ఇదే సరైన సమయంగా భావించిన కూటమి ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయలనే లక్ష్యంతో కూటమి పార్టీల నేతలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. చివరికి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మునిసిపాలిటీ కూడా గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.
ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు చాప కింద నీరులా విస్తరిస్తోంది. స్థానిక సంస్థల పోరులో తమ పార్టీదే పై చెయ్యి ఉండాలని కొంతమంది నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి జనసేన, బీజేపీలో చేరిన సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. ఉదాహరణకు.. జగ్గయ్యపేట మునిసిపాలిటీ కోసం తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు పట్టుబడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మధ్య తొలి నుంచి వైరం ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఓడిన ఉదయభాను.. ఆ తర్వాత జనసేనలో చేరారు. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు.
ఈ ఇద్దరు ఇప్పుడు జగ్గయ్యపేట మునిసిపాలిటీ కోసం పోటీ పడుతున్నారు. శ్రీరామ్ తాతయ్య గతంలో మునిసిపల్ ఛైర్మన్‌గా పని చేశారు. ఇక 2021లో మునిసిపాలిటీని వైసీపీ గెలుచుకోవటంలో ఉదయభాను కీలకంగా వ్యవహరించారు. అలాగే ఐదేళ్లు ఆయన మనిషే చైర్మన్‌గా వ్యవహరించారు. దీంతో ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిని మునిసిపల్ ఛైర్మన్ చేయాలని ఎమ్మెల్యే తాతయ్య పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో ఉదయభాను కూడా.. జనసేన అభ్యర్థిని గెలిపించి.. పవన్ కల్యాణ్‌కు గిఫ్ట్ ఇస్తామని బహిరంగంగా చెబుతున్నారు. ఇదే పరిస్థితి ఒంగోలు కార్పొరేషన్‌లో కూడా నెలకొంది. అక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరు కార్పొరేషన్ ఛైర్మన్ సీటు దక్కించుకునేందుకు తమ తమ పార్టీల అధినేతల దగ్గర తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read : క్రేజీ మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు..!
చైర్మన్ సీటు చెయ్యి జారిపోతే.. స్థానిక ఎమ్మెల్యేగా తమ పట్టుపోతుంది కదా అని టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఐదేళ్లు వైసీపీ నేతలే పెత్తనం చేశారు. ఇప్పుడు కూడా వైసీపీ నుంచి వచ్చిన నేతలకే కేటాయిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కూడా. ఇదే సమయంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన నేతలు కూడా సీటు తమకే కావాలంటున్నారు. తమపై నమ్మకంతోనే వైసీపీ నుంచి నేతలు జనసేన పార్టీలో చేరి కూటమి సర్కార్‌కు మద్దతుగా ఉన్నారని.. అలాంటి వారికి రాజకీయంగా అండగా ఉండాల్సిన బాధ్యత తమపైనే ఉందంటున్నారు. దీంతో స్థానిక పోరు కూటమి పార్టీల నేతల మధ్య రసవత్తరంగా మారింది. సీనియర్ నేతల మధ్య సిగపట్లకు కూడా దారి తీస్తోంది.

