రంగస్థలం చిట్టిబాబుతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబో రామ్ చరణ్, సుకుమార్. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా ఎప్పుడా అనే ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్త చెర్రీ అభిమానులతో పాటు టాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. పుష్పతో పాన్ వరల్డ్ డైరెక్టర్ అయ్యారు సుకుమార్. ఇక ఆర్ఆర్ఆర్, పెద్ది హిట్ తర్వాత రామ్ చరణ్ రేంజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబో సినిమా అనే మాట అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా వినిపిస్తున్న వార్తలు మెగా ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తున్నాయి.
Also Read : బదిలీలపై నిషేధం తొలగిస్తారా..?
పెద్ది సినిమా కోసం తీవ్రంగా శ్రమించిన చరణ్.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో చరణ్ ఆరోగ్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవచ్చనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన పెద్ది సినిమాతో రామ్ చరణ్ భారీ విజయాన్ని అందుకున్నారు. గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం చరణ్ శారీరకంగా ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, స్పోర్ట్స్ ఎపిసోడ్స్ చిత్రీకరణ సమయంలో ఆయనకు చిన్నపాటి గాయాలు అయ్యాయి కూడా. పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ సహా పలు సందర్భాల్లో చరణ్ చేతికి కట్టు ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి ఆరోగ్యంతో తిరిగి సెట్స్‌లోకి రావాలనే ఉద్దేశంతో చరణ్ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని టాక్. అంతేకాకుండా చిన్న సర్జరీ కూడా చేయించుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : రోడెక్కుతున్న తూర్పు కాపులు.. కారణం..!
చరణ్ విశ్రాంతి తీసుకుంటే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన #RC17 ప్రారంభం మరింత ఆలస్యం కావచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సుకుమార్, ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నప్పటికీ, హీరో అందుబాటులో లేకపోతే షూటింగ్ ప్రారంభం కష్టమేనని చెబుతున్నారు. తాజా ప్రచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ 2027 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఒకవేళ అదే జరిగితే రామ్ చరణ్ కొత్త సినిమాను అభిమానులు థియేటర్లలో చూసేందుకు మరో ఏడాదిన్నర ఆగాల్సిందే. దీంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు రామ్ చరణ్ టీమ్ లేదా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

