తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దాదాపు 40 ఏళ్ల తర్వాత ద్రవిడయేతర పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో అధికారం చేపట్టారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీ అమలవుతోంది. అదే సమయంలో అన్నాడీఎంకేకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. వీరంతా త్వరలోనే విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చితో కలిసి మొత్తం ఏడు నియోజకవర్గాలకు త్వరలో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.
Also Read : ఎల్‌నినో ఎఫెక్ట్.. అత్యంత పొడి జూన్..!
అయితే అందరి దృష్టి తిరుచ్చి నియోజకవర్గంపైనే ఉంది. అక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. తొలుత అంతా నటి త్రిష పోటీ చేస్తారని.. ఆమె గెలిస్తే.. డిప్యూటీ సీఎం పదవి కూడా చేపడతారంటూ ప్రచారం జోరుగా జరిగింది. ఆ తర్వాత నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ కూడా బాగా వినిపించింది. విజయ్‌తో లారెన్స్‌కు సన్నిహిత సంబంధాలున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో లారెన్స్ పోటీ చేస్తాడని అంతా భావించారు. అయితే తన రాజకీయ ప్రయాణంపై లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. నిదానంగా ఆలోచించి రాజకీయాల్లోకి వస్తానని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణంపై ‘ఎక్స్’ వేదికగా వీడియో పంచుకున్నారు.
రాజకీయ అరంగేట్రం గురించి గతంలో తాను విడుదల చేసిన వీడియో సందేశానికి పలువురు స్పందించారని, ‘రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావచ్చు కదా? దాని గురించి ప్రజలను ఎందుకు అడగటం’ అంటూ ప్రశ్నించారని తెలిపారు. ‘ఫౌండేషన్‌ను మాత్రం చూసుకో, రాజకీయాల్లోకి రావద్దు’ అని ప్రజలు భావిస్తే?.. అందుకే వారి అభిప్రాయాన్ని అడిగానన్నారు. ‘‘ప్రజల నిర్ణయాన్ని కోరడంలో తప్పేముంది. నేను ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పలేదు. నలుగురికి అన్నం పెట్టాను, సాయం అందించానని రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పలేదు. నలుగురికి మంచి చేస్తున్నాను కాబట్టి, రాజకీయాల్లోకి వస్తున్నానని మాత్రమే చెప్పా. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయాలని, నాకు ఓట్లు వేస్తామని పలువురు చెప్పారు. నేను పోటీ చేయాలనుకోవడం ధర్మం కాదు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీ కార్యకర్తగా కొంతకాలం సేవలు అందించాలనుకుంటున్నా. ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీపై ఆలోచిస్తా. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా… అంటూ క్లారిటీ ఇచ్చారు.
Also Read : రిజిస్టర్ మ్యారేజ్ చెల్లదు: హైకోర్ట్ సంచలన తీర్పు
తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయనని చెబుతున్నాను. అలాగని ఇంకెక్కడా పోటీ చేయనని అర్థం కాదన్నారు. నిదానంగా ఎన్నికల్లో పోటీ చేస్తా. తొందరపాటుతో ఏదీ చేయను. ఇంకాస్త ఆలోచించిన తర్వాతే రాజకీయాల్లోకి వస్తా. ప్రజల ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో ఉన్నా. ఎవరైనా విమర్శ చేస్తే తట్టుకోలేను. నా సంపద వాళ్లు ఇచ్చిందే. ఇలాంటి సమయంలో ఎవరైనా నాపై తప్పుగా మాట్లాడితే బాధ కలుగుతుంది. ఈ విషయంలో మా అమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుని, రాజకీయాలకు దూరంగా ఉండమన్నారు. మా అమ్మ నాకు తొలి అభిమాని. గొప్ప స్నేహితురాలు. మా అమ్మ ఆశీస్సులు లేకపోతే, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ప్రజా తీర్పే శక్తిమంతమైన తీర్పు.’’ అని లారెన్స్ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ విజయం సాధించారు. రెండింటిలో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో అక్కడ జరగనున్న ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తిగా మారింది.

