Monday, April 27, 2026 12:57 PM
Monday, April 27, 2026 12:57 PM

డీజిల్ దందా.. సర్కార్‌కు చెడ్డపేరు..!

ఆయిల్ కంపెనీలు తాము చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ నిందలను డీలర్ల పై వేయడంతో పాటు ప్రభుత్వాలను కూడా బద్నాం చేయాలని పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది. గత నెల రోజుల క్రితం ఏర్పడిన గ్యాస్ కొరత విషయంలోనూ కంపెనీలు వ్యవహరించిన తీరుతోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవాలను పరిశీలించకుండా అధికారులు కూడా గ్యాస్ డీలర్లదే తప్పు అన్నట్లుగా చెబుతూ వచ్చారు. కానీ వాస్తవంలోకి వెళితే గ్యాస్ సిలిండర్లకు ఓటిపి వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌కు దాదాపు చెక్ పెట్టింది. అయితే ఇక్కడ గ్యాస్ వినియోగదారుడే మొదటి ముద్దాయి కావడంతో బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న గ్యాస్ సిలండర్లను నియంత్రించలేక పోయిందనేది వాస్తవం.

ఇక రెండు, మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతోంది కూడా. ఈ క్రమంలోనే సివిల్ సప్లయిస్ కమిషనర్‌తో ఆయిల్ కంపెనీలు నిర్వహించిన సమావేశంలో తమ తప్పేమి లేదని, తాము ఆయిల్ సక్రమంగానే సరఫరా చేస్తున్నామని చెప్పి సమావేశాన్ని మమ అనిపించారు. ఆయిల్ కంపెనీలు చెప్పిన మాటలనే కమిషనర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేశారు. కానీ వాస్తవాలను పరిశీలించడంలో ఇక్కడ ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందింది. కేవలం ఆయిల్ కంపెనీలు చెప్పిన మాటలు నమ్మారు తప్ప కింది స్థాయిలో డీలర్లతో ఒక్క సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నించలేదు.

అధికారులు కూడా పెట్రోలు బంకులను పరిశీలించిన క్రమంలో కేవలం స్టాకు వివరాలు మాత్రమే చూస్తున్నారు. ఉన్న స్టాకు తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తగా ప్రజలకు అందించాలని చెబుతుంది. ఇదే క్రమంలో ఉన్న నిల్వలు ఎన్ని రోజులు వస్తాయో అడిగి తెలుసుకుంటున్నారు. అదే విధంగా నూతన లోడ్ ఎప్పుడు వస్తుందని మాత్రమే అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అసలు సదరు పెట్రోల్ బంకు డీలర్ ఎప్పుడు ఆయిల్ కంపెనీలకు డబ్బులు చెల్లించాడు..? ఇండెంట్ ఎప్పుడు పెట్టాడు..? అయిల్ కంపెనీలు ఎప్పటి లోగా పంపాలి..? ఎప్పటికి పంపించారు..? అనే వివరాలు సేకరించడంలో అధికారులు కూడా ఒక అడుగు వెనుకనే ఉన్నారు.

వాస్తవానికి పెట్రోలు బంకుల్లో పరిశీలించాల్సిన ప్రధమ స్థాయి వివరాలు ఇవే.. వీటితో పాటు తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల డీలర్లతో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలి. ఆ వివరాలను ప్రభుత్వానికి పంపిస్తే తప్ప ఈ సమస్యకు కొంత పరిష్కారం దొరకదు. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఆ దిశగా అడుగులు వేయకుండా అధికారులు మాత్రం ఆయిల్ సరిపడా ఉందని పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. కానీ బంకుల్లో మాత్రం ఆయిల్ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కింది స్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేసి ప్రజలకు పెట్రోల్, డీజిల్ సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విశాఖ.. పోర్ట్ టూ...

అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ...

కవిత టీఆర్ఎస్‌.. ఏపీలో...

నా శత్రువుకు శత్రువు నా మిత్రుడు...

అయ్యా వడ్డే గారు.....

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీరును...

బ్రేకింగ్: జగన్ అండ్...

గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా...

సరిహద్దు వంతెన పంచాయతీ..!

ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడంలో...

జగన్ మెప్పు కోసం...

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తన దారి...

పోల్స్