ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సినిమా వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అప్పట్లో ఇబ్బంది పెట్టాలనుకోవడం వారికి ఏకంగా ఐపిఎస్ అధికారులు సహకరించడం సంచలనం అయింది. ఇప్పుడు ఆ నటి విజయవాడ వచ్చి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. ఆమె కేసుపై విచారణ కోసం ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు భేటీ నిర్వహించారు. పలు కీలక కేసులపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు.
డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు చంద్రబాబు. జత్వానీ, గుడ్లవల్లేరు ఘటనలపై వివరణ కోరిన చంద్రబాబు… గుడ్లవల్లేరు ఘటనపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించారు. జత్వానీ కేసు విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. జత్వానీ కేసులో పారదర్శకంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కేసులో ఎంతపెద్దవారున్నా వెనుకంజ వేయొద్దని స్పష్టం చేసారు. జత్వానీ కేసులో విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని డీజీపీని చంద్రబాబు ఆదేశించారు.
గత ప్రభుత్వంలో జరిగిన మదనపల్లె ఘటన విచారణపైనా ఆరా తీసారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో పురోగతిపై కూడా చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ అవినీతిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు, బకాయిలపై అధికారుల వివరణ తీసుకున్నారు. అటు గుడ్లవల్లేరు కేసుపై ప్రతీ మూడు గంటలకు తనకు వివరణ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. జిల్లా కలెక్టర్, మంత్రి కొల్లు రవీంద్రా విద్యార్ధులతో చర్చలు జరుపుతున్నా విద్యార్ధులు మాత్రం శాంతించలేదు. దీనిపై చంద్రబాబు మంత్రితో మాట్లాడి పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

