కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర ప్రాంత రైతుల ప్రయోజనాలు, జలాల వినియోగంపై నిర్వహించిన సమావేశం చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాలు వేర్వేరు అయినప్పటికీ దేశంగా మనమంతా ఒక్కటేనని, రైతుల సంక్షేమం కోసం పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటిని అందించడంలో తుంగభద్ర డ్యామ్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు.
Also Read : తిరుపతిలో భూమన భారీ భూబాగోతాలు..!
2024 ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టులో 19వ నంబర్ గేట్ కొట్టుకుపోయిన ఘటన తర్వాత తక్షణమే స్టాప్-లాక్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టినట్లు చంద్రబాబు తెలిపారు. అనంతరం రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 క్రస్ట్ గేట్లను పునరుద్ధరించి ప్రాజెక్టును మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు. ఈ పనులను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సమన్వయంతో పూర్తి చేశాయని పేర్కొన్నారు. గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పాల్గొని వివిధ గేట్లను ప్రారంభించారు.

ప్రారంభోత్సవానికి ముందు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర ప్రాజెక్టు భవిష్యత్తు, జలాల వినియోగం, రైతుల ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించారు. రైతుల సంక్షేమం అన్ని ప్రభుత్వాల ఉమ్మడి లక్ష్యమని, ఈ సమావేశం దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారానికి కొత్త దిశను చూపిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read : ముగ్గురు సీఎంల చారిత్రాత్మక భేటీ.. తుంగభద్ర వేదికగా సరికొత్త రాజకీయం..!
తుంగభద్ర నదికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను గుర్తుచేసిన ముఖ్యమంత్రి, విజయనగర సామ్రాజ్యానికి మరియు హంపీ నగరానికి ఈ నది సహజ రక్షణ కవచంగా నిలిచిందన్నారు. జోగులాంబ ఆలయం, హంపీ విరూపాక్ష ఆలయం, మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు తుంగభద్ర తీరానే వెలసినట్లు పేర్కొన్నారు. ఆధునిక దేవాలయాలుగా భావించే ప్రాజెక్టులను సంరక్షించడం దేశాభివృద్ధికి అత్యంత అవసరమని ఆయన అన్నారు.
దేశ భవిష్యత్తు కోసం నదుల అనుసంధానం అత్యవసరమని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఉత్తర భారతదేశంలో కెన్–బేత్వా ప్రాజెక్టు విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో జలాశయాలకు నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి వనరులను పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముందుగా రాష్ట్రాలు అంతర్గతంగా నదుల అనుసంధానాన్ని చేపట్టి, అనంతరం రాష్ట్రాల మధ్య అనుసంధానానికి అడుగులు వేయాలని ఆయన ప్రతిపాదించారు.

