ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మరో పరిశ్రమ పై అధికార కూటమి ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఇప్పటికే రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్స్ సంస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ మిల్లు నుంచి వచ్చే వ్యర్థాలను నేరుగా గోదావరి నదిలోకి వదలటం వల్ల పవిత్ర గోదావరి నది కలుషితమవుతోందని.. దీని వల్ల రాజమండ్రి సహా కోనసీమ వాసులకు సరఫరా చేసే మంచి నీళ్లు విషపూరితమవుతున్నాయని పవన్ ఆరోపించారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. తాజాగా ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఐటీసీ సంస్థ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.
Also Read : పవన్-రాధా భేటీ వెనుక టీడీపీ మాస్టర్ ప్లాన్..?
“మా ప్రాంతంలో పరిశ్రమ పెట్టి, స్థానిక వనరులతో వేల కోట్ల వ్యాపారం చేస్తూ లాభాలు గడిస్తున్నప్పుడు.. ఆ నిధులను స్థానిక ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా ఎక్కడో వెచ్చించడమేంటి?” అంటూ అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రముఖ సంస్థ ఐటీసీ ప్రతినిధులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత.. సీఎస్ఆర్ నిధుల కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలని, స్థానిక ప్రజల ప్రయోజనాలే పరమావధిగా నిధులు ఖర్చు చేయాలని ఆయన గట్టిగా నిలదీశారు.
అనపర్తిలోని పొగాకు ప్రాసెసింగ్ యూనిట్ ఐటీసీ ప్రతినిధులతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ఆర్ నిధుల గురించి చర్చించారు. అనపర్తి నియోజకవర్గంలో ఐటీసీ సంస్థ చేపట్టిన కార్యక్రమాలపై వివరాలు సేకరించారు. వేల కోట్ల వ్యాపారం చేస్తున్న సంస్థ.. అనపర్తిలో ఓ చిన్న నీటి ట్యాంకు కట్టించి సరిపెట్టినట్లు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీసీ సంస్థ ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి.. సంస్థ స్థానిక ప్రాంతానికి ఇస్తున్న ప్రాధాన్యత ఇదేనా అని నిలదీశారు. అసలు ఐటీసీ కంపెనీకి వస్తున్న వార్షిక వ్యాపార లావాదేవీలు ఎంత? అందులో వస్తున్న నికర లాభ ఎంత? చట్టప్రకారం అందులో ఎంత శాతం సీఎస్ఆర్ నిధులుగా కేటాయించాలి? స్థానిక అనపర్తి ప్రాంతానికి అందులో ఎంత శాతం ఖర్చు పెడుతున్నారు? అని ప్రశ్నించారు.
అనపర్తిలో సంస్థ ఉంటే.. నిధులు ఎక్కడో ఖర్చు పెడతారా?.. అని సంస్థ ప్రతినిధులను నిలదీశారు. స్థానికంగా ఐటీసీ పొగాకు రీ-డ్రైయింగ్, ప్రాసెసింగ్ పరిశ్రమ నిర్వహించడం వల్ల చుట్టుపక్కల వాతావరణం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంటే.. ఇక్కడి నుంచి వచ్చే నిధులను మరెక్కడో అభివృద్ధికి వెచ్చించడం ఏ రకమైన న్యాయమన్నారు. సీఎస్ఆర్ నిధుల వినియోగానికి సంబంధించి పక్కా పారదర్శక విధానం ఉండాలి. స్థానిక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే భారీ ప్రాజెక్టులను చేపట్టకుండా, ఏదో పేరుకు చిన్నపాటి పనులు చేసి చేతులు దులుపుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
Also Read : మజ్లీస్ నుంచి దానం పోటీ..?
సీఎస్ఆర్ నిధుల మళ్లింపు, పారదర్శకత లేకపోవడంపై అవసరమైతే అసెంబ్లీలోనే మాట్లాడుతా.. అంటూ సంస్థ ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు నల్లమిల్లి. పొగాకు రీ-డ్రైయింగ్, ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభానికి ముందే ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం గురించి ప్రస్తావించారు. స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్య రంగాల ప్రాజెక్టులను సీఎస్ఆర్ కింద చేపట్టేలా ఒత్తిడి తెస్తామని నల్లమిల్లి తేల్చి చెప్పారు.

