ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. అయితే వైసీపీ నేతల్లో మాత్రం ఇప్పటి నుంచే భయం మొదలైంది. అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఇప్పటి నుంచే చాలా మంది నేతలు టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చినందుకు ఆనందపడాలో.. చివరి నిమిషంలో మారుస్తారని భయపడాలో తెలియక టెన్షన్‌తో నరకం అనుభవిస్తున్నారు. పార్టీ సూచించే కార్యక్రమాలు చేయాలంటే.. డబ్బు ఖర్చు పెట్టాలి. మరి ఆ డబ్బు ఖర్చు చేసిన తర్వాత చివర్లో తమను కాదని మరొకరికి టికెట్ ఇస్తే.. పెట్టిన డబ్బులు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి కదా భయపడుతున్నారు వైసీపీ నేతలు.
Also Read : రాజకీయాల నుంచి విజయ్ అవుట్.. తండ్రి మద్దతు కోడలికే
ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరూ అనే చర్చ జోరుగా జరుగుతోంది. నిజానికి వరుసగా జరిగిన మూడు ఎన్నికల్లో కూడా వైసీపీకి విజయవాడ ఎంపీ స్థానం కొరకరాని కొయ్యగా మారింది. 2014, 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన నాని.. తన సోదరుడు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్నీ చేతిలో ఓడిపోయారు. రెండు సార్లు ఎంపీగా గెలిచిన నాని.. ఒక్క ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. టీడీపీ తరఫున మరోసారి చిన్నీ ఖాయమనేది ఆ పార్టీ నేతల మాట. మరి వైసీపీ తరఫున ఎవరూ అనేది ఇప్పటి నుంచే జరుగుతున్న చర్చ.
నిజానికి వైసీపీ తరఫున పోటీ చేసిన వాళ్లంతా.. ఓడిపోతున్నారు.. ఆ తర్వాత రాజకీయాలకే గుడ్ బై చెప్పేస్తున్నారు. 2014లో ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు ప్రసాద్ అలియాస్ ట్రైమాక్స్ ప్రసాద్ పోటీ చేశారు. కోనేరు రాజేంద్రప్రసాద్ ఎమ్మార్ కేసులో గోల్ఫ్ కోర్సు, విల్లాల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016లోనే వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఆయన 2023 నవంబర్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఆ తర్వాత 2019లో మరో పారిశ్రామిక వేత్త పొట్లూరి వర ప్రసాద్ వైసీపీ తరఫున పోటీ చేసి ఓడారు. వైసీపీ అధికారంలోకి రావడంతో.. కొద్ది రోజుల పాటు యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ ఆయనపై హైదరాబాద్‌లో కిడ్నాప్ కేసు నమోదు కావడంతో.. రాజకీయాలకు దూరమయ్యారు.
Also Read : కల్తీ నెయ్యి కేసు: కమిషన్ రిపోర్ట్‌తో రాజకీయ దుమారం?
2019లో పోటీ చేసి కేశినేని నాని కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై వైసీపీ అధినేత ఇప్పటి నుంచే దృష్టి సారించినట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ముందుగా విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త దేవినేని అవినాష్ పేరును పరిశీలించినట్లు తెలుస్తోంది. 2014లో కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా అవినాష్ పోటీ చేశారు. దీంతో మరోసారి రంగంలోకి దింపుతారనే చర్చ జోరుగా నడిచింది. అయితే అవినాష్ బదులుగా.. ఓ మీడియా సంస్థ అధినేతకు టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన సదరు యజమాని.. చంద్రబాబుపై ఆగ్రహంతో వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే రెండుసార్లు జగన్‌తో మంతనాలు జరిపినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఓ సర్వే సంస్థ ద్వారా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థిగా మీడియా సంస్థ యజమాని ఖరారు కావడంతో.. హమ్మయ్య అని దేవినేని అవినాష్ ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది.

