Monday, June 15, 2026 04:45 PM
Monday, June 15, 2026 04:45 PM

అయోధ్య ఆలయంలో దొంగలు పడ్డారు..!

అయోధ్య రామాలయం.. ప్రస్తుతం కోట్లాది హిందువుల ఆరాధ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రతీక. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ హుండీల్లో విరాళాలు సమర్పిస్తున్నారు. ఆలయం ప్రారంభమై రెండేళ్లు కూడా పూర్తి కాకముందే వేల కోట్ల రూపాయల నిధులు ట్రస్ట్ ఖాతాల్లోకి చేరాయి. అయితే ఇప్పుడు అదే విరాళాలపై అనుమానాల మబ్బులు కమ్ముకున్నాయి. కోట్లాది రూపాయల విరాళాలు లెక్కల్లో కనిపించడం లేదంటూ వచ్చిన ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఉద్యోగుల ఇళ్లలో నగదు స్వాధీనం, తక్కువ జీతాలతో భారీ ఆస్తుల కొనుగోళ్లు, ప్రతిపక్షాల ఆరోపణలు, ట్రస్ట్ ఖండనలు.. మొత్తం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read : గోదావరి – బనకచర్లకు సంపూర్ణ మద్దతు..!

రామాలయ విరాళాల్లో రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు నిధులు మాయమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ ఆరోపణలుగా మొదలైనా, ఆలయ ఖాతాల నిర్వహణలో పని చేసినట్లు చెప్పుకున్న మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు చర్చకు మరింత ఊతమిచ్చాయి. తనకు తెలిసిన కొన్ని అవకతవకల గురించి సంబంధిత అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోలేదని పవన్ పాండే వెల్లడించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. దేశవ్యాప్తంగా కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామాలయం వార్తల్లో నిలిచింది. ఆలయానికి వచ్చిన విరాళాల్లో కోట్ల రూపాయలు మాయమయ్యాయనే ఆరోపణలు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం.. సిట్ ఏర్పాటు చేయడం, ఆలయ ఉద్యోగుల ఇళ్లలో నగదు స్వాధీనం కావడం, ట్రస్ట్ – ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగడం ఈ వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చాయి.

ఆరోపణలు తీవ్రతరం కావడంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ 2024 నుంచి వచ్చిన విరాళాలపై ప్రత్యేక ఆడిట్ చేపట్టింది. అయితే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ‘ప్రతి విరాళాన్ని క్రమబద్ధంగా లెక్కించి, ఆడిట్ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి అక్రమాలు బయటపడలేదు’ అని చంపత్ రాయ్ వెల్లడించారు. అయితే ఈ వివరణపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. విరాళాల లెక్కలు, సీసీటీవీ దృశ్యాలు, బ్యాంకు రికార్డులను బహిరంగంగా విడుదల చేయాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

Also Read : ఢిల్లీ దూతలను తరిమేస్తున్న హస్తం నేతలు..!

విరాళాల లెక్కింపునకు బాధ్యత వహించిన ఉద్యోగుల్లో ఒకరు రూ.1.5 కోట్ల విలువైన భూమిని, మరొకరు రూ.40 లక్షల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం బయటకు రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. వీరి నెల జీతం కేవలం రూ.20వేల పరిధిలోనే ఉంది. ఇదే సమయంలో మరో ఉద్యోగి ఇంట్లో పోలీసులు రూ.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆలయ ఉద్యోగిగా చేరక ముందు సాధారణ కార్ మెకానిక్‌గా పనిచేసిన ఆ వ్యక్తి ఆర్థిక స్థితిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు కూడా అనుమానాలకు తావిచ్చింది.

పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం విరాళాల లెక్కింపు నుంచి బ్యాంకు ఖాతాల్లో జమయ్యే వరకు మొత్తం ప్రక్రియను పరిశీలించనుంది. విచారణలో భాగంగా హుండీల నిర్వహణ, నగదు లెక్కింపు విధానం, ఉద్యోగుల పాత్ర, పర్యవేక్షణ వ్యవస్థ, అంతర్గత నియంత్రణలు, సీసీటీవీ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు అన్నింటినీ పరిశీలించనున్నారు. ఏడు రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంది.

2024లో ప్రారంభమైనప్పటి నుంచి రామాలయం దేశంలో అత్యధిక విరాళాలు అందుకుంటున్న ఆలయాల్లో ఒకటిగా ఎదిగింది. ఆలయం ప్రారంభమైన తొలి 11 రోజుల్లోనే రూ.11 కోట్లకు పైగా విరాళాలు అందాయి. తొలి ఆర్థిక సంవత్సరాంతానికి మొత్తం ఆదాయం రూ.327 కోట్లకు చేరగా, అందులో రూ.153 కోట్లు నేరుగా భక్తుల విరాళాల రూపంలోనే వచ్చాయి. గత ఏడాది చివరి నాటికి ట్రస్ట్‌కు మొత్తం రూ.4,600 కోట్లకు పైగా నిధులు అందినట్లు ప్రకటించింది. కౌంటర్ల వద్ద ఇచ్చే విరాళాలకు రసీదులు జారీ చేయడం వల్ల అక్కడ అవకతవకలకు అవకాశాలు తక్కువగా ఉంటాయని ట్రస్ట్ చెబుతోంది. అయితే హుండీల్లో వేసే నగదు విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. హుండీలను తెరిచిన తర్వాత బ్యాంకు సిబ్బంది ట్రస్ట్ ప్రతినిధుల సమక్షంలో, సీసీటీవీ పర్యవేక్షణలో నగదును లెక్కిస్తారు. అనంతరం లాకర్లలో భద్రపరిచి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. టీసీఎస్ కూడా ఆడిట్ చేస్తోంది.

Also Read : లోకేష్ ని హీరోని చేస్తున్న జగన్ అండ్‌ కో..!

రామాలయం చుట్టూ ఇదే తొలి వివాదం కాదు. 2021లో ఆలయం పేరుతో నకిలీ ట్రస్ట్ వెబ్‌సైట్ నిర్వహించి భక్తులను మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 2024లో ప్రసాదం పంపిస్తామని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసిన మరో మోసం కూడా వెలుగులోకి వచ్చింది. అలాగే ఆలయ నిర్మాణానికి సంబంధించి భూముల కొనుగోళ్లలో అధిక ధరలు చెల్లించారనే ఆరోపణలు గతంలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అయితే వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా వచ్చిన ఆరోపణలు.. కోట్ల రూపాయల కుంభకోణంగా మిగిలిపోతుందా? లేక రాజకీయ ఆరోపణగానే తేలిపోతుందా? అన్నది సిట్ నివేదికే నిర్ణయించనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గోదావరి – బనకచర్లకు...

గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు మద్దకు...

ఏపీకి కేంద్రం భారీ...

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం...

రోడెక్కుతున్న తూర్పు కాపులు.....

తూర్పు కాపులో తొలిసారి రోడెక్కారు. ప్రధానంగా...

కింగ్ పిన్ చుట్టూ...

వేల కోట్ల మద్యం కుంభకోణం, రవాణా...

బదిలీలపై నిషేధం తొలగిస్తారా..?

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పై నిషేధం...

కేంద్ర మంత్రివర్గంలో జనసేన.....

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం...

పోల్స్