సచివాలయ ఉద్యోగులు అంతా నర్ కార్యక్రమంలో ఉన్నారు. ఉద్యోగులంతా ఆ పనుల్లోనే బిజీబిజీగా ఉన్నారు. యంత్రాంగం శతశాతం సర్ పూర్తి చేయాలని సిబ్బందిపై ఒత్తిడి చేస్తుండడంతో సచివాలయం ఉద్యోగులు ఆ పనులు తప్ప మరో వాటిపై దృష్టి పెట్టడం లేదు. ఆ పనుల కారణంగా కనీసం వారు సచివాలయంలో ఉండే పరిస్థితి లేకుండా పోతుంది. వివిద సమస్యలపై స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలకు వచ్చే జనానికి సమాధానం చెప్పే వారే అక్కడ కరువవుతున్నారు. సర్‌లో సచివాలయ ఉద్యోగులు బిజీగా ఉండడంతో వల్ల ఏకీకృత కుటుంబ సర్వే.. యూఎఫ్ఎస్ సర్వే సమస్యలను పట్టించుకోవడంలేదు.
Also Read : సింగిల్‌గా పోరాడుతున్న జనసేనాని..!
వైసీపీ ప్రభుత్వ హయాంలో హౌస్ హోల్డ్ సర్వే.. కుటుంబ గణన చేసి వివరాలను మ్యాపింగ్ చేశారు. అప్పట్లో ఆ సర్వేలోను మ్యాపింగ్‌లో కూడా అనేక తప్పులు చోటుచేసుకున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైన కొందరు లబ్ధిదారులు నోచుకోవడం లేదు. మ్యాపింగ్‌లో తప్పులను సరిచేసే అవకాశం కూడా లేకపోవడంతో అనేక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. హౌస్ హోల్డ్ సర్వేలో లోపాలు, మ్యాపింగ్ తప్పులను సవరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా గతేడాది డిసెంబర్ నుంచి నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వే.. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే తుదిదశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో సర్వేలో ఏమైనా తప్పులు జరిగినట్లుగా గుర్తిస్తే వాటిని గ్రామ సభల్లో సరిచేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
యూఎఫ్ఎస్ సర్వేలో సేకరించిన కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఆన్ లైన్‌లో నమోదు చేశారు. వాటి పరిశీలన కోసం ఈనెల 19న అన్ని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలలో నోటీసు బోర్డుల్లో జాబితాలను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ చాలాచోట్ల స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ నోటీసు బోర్డుల్లో సంబంధిత సిబ్బంది ఆ వివరాలనే పొందుపరచలేదు. కుటుంబ సర్వేపై స్థానికుల నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని ఈ నెలాఖరులోగా అందజేయాల్సి ఉంది. అలా వచ్చిన వాటిని పరిశీలించి పొరపాట్లను సవరించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల నోడల్ అధికారులు ప్రజలను కోరారు.
Also Read : సూర్యవంశీ.. టీమిండియా టూర్ లో ఊహించని ట్విస్ట్..!
తుది గడుపు ముగుస్తోంది. సర్ పనులలో సచివాలయ ఉద్యోగులు అంతా బిజీగా ఉండిపోవడంతో యూఎఫ్ఎస్ సర్వేలో జరిగిన పొరపాట్లపై సచివాలయానికి వచ్చే వారికి సమాధానం ఇచ్చే వారు అక్కడ కన్పించడం లేదు. ఎవరో ఒక్కరు సచివాలయంలో అందుబాటులో ఉన్నా.. వారు సంబంధిత సెక్రెటరీ లేరని తర్వాత రమ్మంటూ పంపేస్తున్నారు. దీంతో జనం సచివాలయాల చుట్టూ తిరగడం తప్ప వారి పనులు మాత్రం పూర్తి కావడం లేదు. యూఎఫ్ఎస్ సర్వే ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నది. దాని ద్వారా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు జారీ చేయనున్నారు. సర్వేలోని వివరాల ఆధారంగా లబ్దిదారులకు ఏయే పథకాలు అందించాలన్న దానిపై అధికారులు ప్రణాళిక రూపొందించనున్నారు. అర్హతలకి అనుగుణంగానే లబ్ధిదారులకి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెంచన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం తదితర పథకాలను వర్తింపజేయనున్నారు.
ఎంతో ప్రాధాన్యం గల ఈ సర్వే తప్పుల తడకగా ఉండడంతో అభ్యంతరాలు స్వీకరించడానికి స్వర్ణ గ్రామాల వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రజల వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన ఏకీకృత కుటుంబ సర్వే లోపాలను సరిచేసే గడువును ప్రభుత్వం పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన హౌస్ హోల్డ్ సర్వేలో లోపాలు ఉండడంతో అర్హత కలిగిన పేదలు పథకాలు పొందలేకపోయారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కీలకంగా తీసుకునే ఈ సర్వే పారదర్శకంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

