భారత్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగినపల్లి మామిడి పండ్లు మొదటిసారిగా వాణిజ్య సముద్ర రవాణా ద్వారా సింగపూర్ కు విజయవంతంగా చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, లక్నోకు చెందిన ఐసిఏఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ చారిత్రాత్మక రవాణా ప్రక్రియ సాగింది. ఎపీలోని గ్యాప్ సర్టిఫైడ్ తోటల నుండి సేకరించిన 5 మెట్రిక్ టన్నుల ప్రీమియం క్వాలిటీ బంగినపల్లి మామిడి పండ్లను, కర్ణాటకలోని గుర్తింపు పొందిన ప్యాక్ హౌస్ లో ప్యాక్ చేసి జూన్ 11న రవాణా చేయగా, అవి జూన్ 24 నాటికి సింగపూర్ చేరుకున్నాయి.
Also Read: ట్రంప్ డిజిటల్ పన్నులు..? భారత్ పై ఎఫెక్ట్..!
ఈ మామిడి పండ్ల కన్సైనమెంట్ ను దిగుమతి చేసుకున్న సింగపూర్ కు చెందిన ‘EC-Links Pte Ltd’ సంస్థ, పండ్ల నాణ్యత అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది. శాస్త్రీయ పద్ధతుల్లో కోత అనంతర నిర్వహణ, కోల్డ్-చైన్ లాజిస్టిక్స్ పాటించడం వల్ల పండ్లు సరైన రీతిలో పక్వానికి వచ్చాయని వారు తెలిపారు. సింగపూర్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఈ పండ్లు మంచి నిల్వ సామర్థ్యం కలిగి ఉండి, పూర్తి తీపిదనంతో ఉన్నాయని ధృవీకరించారు. ఈ అంతర్జాతీయ ఎగుమతి వల్ల మన దేశీయ రైతులకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరింది.
Also Read : అదానిని వెంటాడుతున్న అమెరికా ఫెడరల్ కోర్టు..!
సాధారణంగా స్థానిక మార్కెట్లో బంగినపల్లి మామిడి ధర కిలోకు రూ.25 నుండి రూ.26 వరకు పలుకుతుండగా, ఈ సముద్ర మార్గ ఎగుమతి ద్వారా రైతులకు కిలోకు దాదాపు రూ.50 ధర లభించింది. దీనితో రైతుల ఆదాయం ఏకంగా రెట్టింపు కావడంతో తోటల పెంపకందారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పండ్ల ఎగుమతులు ఎక్కువగా విమానాల ద్వారా జరిగేవి, దీనివల్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగేవి. అయితే తాజా విజయంతో సముద్ర రవాణా అనేది తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణ అనుకూలమైన, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఎగుమతులు చేయడానికి అత్యంత అనువైన మార్గమని నిరూపితమైంది. ఇది గ్లోబల్ మార్కెట్లో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల నమ్మకత్వాన్ని మరింత పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.

