కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం గోవింద నామస్మరణతో సప్తగిరులు మారుమోగుతుంటాయి. లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల చేరుకుంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా తిరుమల గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గడువు మరో నెల రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ ఎవరనే విషయంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. నిజానికి తనకు మీడియా పరంగా అన్ని విధాలుగా మద్దతు తెలిపారనే కృతజ్ఞతతో పార్టీ సభ్యత్వం లేకపోయినా కూడా ప్రసుత చైర్మన్ బీఆర్ నాయుడుకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
Also Read : ఫ్లైదుబాయ్ విమానం కూల్చే కుట్ర వెనుక ఇరాన్ హస్తం..?
బీఆర్ నాయుడు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీలో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. తిరుపతిలో తొక్కిసలాట, 8 మంది భక్తుల మృతి.. సౌకర్యాల కల్పనపై భక్తుల అసహనం, ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నారంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు, ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం.. ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారింది కూడా. ఒక దశలో ఈ ఏడాది మే నెలలోనే బీఆర్ నాయుడు స్థానంలో కొత్త చైర్మన్‌ను నియమిస్తారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో పార్టీకి చెందిన సీనియర్ నేతలు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావుల పేర్లు కూడా చైర్మన్ రేసులో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి.
Also Read : వైసీపీ వెర్సస్ ఇండియా టుడే.. మేం పిలిచాం.. మీరే రాలేదు..!
అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ.. శ్రీనివాస రామానుజం అనే ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆధ్యాత్మిక వేత్తను టీటీడీ చైర్మన్‌గా చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీనివాస రామానుజం అసలు పేరు లోకాద్రి నాయుడు. చిత్తూరు జిల్లా పూతలపట్టు వాసి. డెయిరీ, మైనింగ్ వ్యాపారాలతో పాటు రాజకీయ వర్గాల్లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జియర్ స్వామికి ప్రియ శిష్యునిగా మారిన లోకాద్రి నాయుడు రామనుజ మతంలో మారిపోయారు. భుజాలకు శంఖు చక్రాలు వేయించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన హోమం మొత్తం శ్రీనివాస రామానుజం ఆధ్వర్యంలో జరిగింది.
Also Read : వైసీపీ పెద్ద తలకాయలపై గురిపెట్టిన ఈడీ..!
బీజేపీ అగ్రనేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న శ్రీనివాస రామానుజం కుటుంబం ఒక దశలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే వైసీపీ తరఫున విడదల రజినీ కావడంతో.. శ్రీనివాస రామానుజం భార్య వీఆర్ లక్ష్మీ శ్యామలకు బదులుగా బీసీ నేత గల్లా మాధవిని బరిలోకి దింపారు. దీంతో లక్ష్మీ శ్యామలను తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఇక ఇటీవల తెలుగు మహిళ పదవి రేసులో కూడా లక్ష్మీ శ్యామల పేరు బలంగా వినిపించింది. ఇవేవీ కాదని.. ఇప్పుడు శ్రీనివాస రామానుజంకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. మరి ఆధ్యాత్మిక, రాజకీయ, వ్యాపార రంగాల్లో బిజీగా ఉంటున్న శ్రీనివాస రామానుజం.. చైర్మన్ పదవికి ఓకే చెబుతారో లేదో చూడాలి.


