మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తెలుగుదేశం పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సాధించిన అఖండ విజయంతో, ఆ మున్సిపాలిటీపై దశాబ్దాల తర్వాత పసుపు జెండా రెపరెపలాడింది. తాజాగా పులివెందుల మున్సిపల్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్పర్సన్గా తూగుట్ల గీతాకుమారి, వైస్ ఛైర్పర్సన్గా షేక్ మహబూబ్ జాన్ అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు.
Also Read : అంతర్గత ప్రజాస్వామ్యం.. బాగా ముదిరినట్లుంది..!
కౌన్సిలర్లతో పాటు వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించడంతో వైఎస్సార్సీపీ కంచుకోటలో కూటమి పాలనకు శ్రీకారం చుట్టినట్లయింది. ఇటీవల వెలువడిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి, వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై 13,898 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మొత్తం 40 వార్డుల్లో కూటమి ఏకంగా 37 వార్డులను (టీడీపీ 34, బీజేపీ 2, స్వతంత్ర 1) కైవసం చేసుకుని వైసీపీని కేవలం 3 స్థానాలకే పరిమితం చేసింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో పులివెందుల మున్సిపల్ పీఠం కూటమి వశమైంది.
Also Read : బాలయ్య బాటలోనే మెగాస్టార్ చిరంజీవి..?
ఎన్నికల నిబంధనల ప్రకారం నూతన కౌన్సిల్ సమావేశంలో గీతాకుమారి, షేక్ మహబూబ్ జాన్ ప్రమాణస్వీకార ప్రక్రియను అధికారులు పూర్తి చేయించారు. సుదీర్ఘ విరామం తర్వాత పులివెందుల మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం కొలువుదీరడంతో నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణ కూడళ్లలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ గీతాకుమారి మాట్లాడుతూ.. పులివెందుల ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, పార్టీలకతీతంగా పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.


