ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కొత్త రికార్డు నెలకొల్పింది. దాదాపు రెండు వారాల పాటు జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాలు పూర్తి ఏకపక్షంగా జరిగాయి. మండలి సమావేశానికి వైసీపీ ఎమ్మెల్సీలు హాజరైనప్పటికీ… శాసనసభ సమావేశానికి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. దీంతో తొలి రోజు నుంచే సభ చప్పగా సాగిందనే చెప్పాలి. వాస్తవానికి శాసనసభ సమావేశాలు అంటే వాడీవేడిగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. సభలో ప్రశ్నోత్తరాల సమయం మొదలు… వాయిదా తీర్మానాలు, బిల్లులపై చర్చలు… ఓటింగ్ ప్రక్రియ… ఇలా ఎన్నో విషయాలు ఆసక్తి కలిగిస్తాయి. ఇక అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదులాట, ఆరోపణలు, సూటీపోటీ మాటలు, విమర్శలు… ఇవేవీ లేకుండానే రెండు వారాలు సాగిన ఏపీ అసెంబ్లీ… మొత్తం 26 బిల్లులకు ఆమోదం తెలిపింది.
Also Read : ఆ తప్పంతా జగన్ దే.. బాలినేని సంచలన ఆరోపణలు
11 స్థానాలు మాత్రమే గెలుచుకున్నప్పటికీ… తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతో అసెంబ్లీ సమావేశాలను జగన్ బాయ్‌కాట్ చేశాడు. తాను రాకపోగా… ఇతర సభ్యులు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని జగన్ స్పష్టం చేశాడు. దీంతో 164 మంది అధికార కూటమి సభ్యులే వాళ్లల్లో వాళ్ళు చర్చించుకున్నారు… నవ్వుకున్నారు… చివరికి బిల్లులను ఆమోదించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ… విభజిత రాష్ట్రంలో కానీ… ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ జరగలేదు. 23 స్థానాలు మాత్రమే వచ్చినప్పటికీ… చంద్రబాబు సభకు వచ్చారు. సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక 2014లో ప్రతిపక్ష నేతగా జగన్ సభకు వచ్చాడు. అయితే పాదయాత్ర పేరుతో సభ గైర్గాజరయ్యారు.
అదే సమయంలో ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో… ఏపీ అసెంబ్లీలో బీజేపీ నేతలే ప్రతిపక్ష పాత్ర పోషించారు. దీంతో సభ కాస్త ఆసక్తికరంగా సాగింది. ఇక 2019లో కూడా అధికారంలోకి వచ్చిన వైసీపీని టీడీపీ నేతలు నిలదీశారు. సభ చివరి రోజు వరకు ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించారు. అయితే ప్రతిపక్ష హోదా సాకుతో జగన్ అసెంబ్లీకి రాలేదు. పైగా తన పార్టీ నేతలను కూడా రానివ్వలేదు. అలాగే మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు… అది కూడా లేదు. ఇక అసెంబ్లీ జరుగుతున్నంత సేపు వైసీపీ నేతలు ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడుతారన్నారు. కానీ అది కూడా జరగలేదు. ఇక అసెంబ్లీకి వైసీపీ నేతలు రాకపోవటంతో… టీడీపీ నేతలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు చెప్పిందే సమాధానం అన్నట్లుగా మారిపోయింది.
Also Read : రాంగోపాల్ వర్మ అరెస్ట్ కి సర్వం సిద్దం
సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు చేయలేదు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము సభకు వస్తే మైక్ ఇవ్వరనేది జగన్ ప్రధాన ఆరోపణ. అసలు వైసీపీ నేతలు సభకు వస్తే కదా… మాట్లాడే అవకాశం వస్తుందో రాదో తెలుస్తుంది అంటున్నారు విమర్శకులు. అయినా సభకు వచ్చి అవమానాలు భరిస్తేనే కదా… ప్రజల్లో సానుభూతి వస్తుందనేది కొంతమంది వైసీపీ నేతల మాట. ప్రతిపక్ష హోదా ఇచ్చినా, ఇవ్వకపోయినా కూడా… ప్రస్తుత శాసనసభలో వైసీపీ ప్రతిపక్షమే అని… కాబట్టి సభకు వచ్చి సమస్యలపై చర్చించాలనేది వైసీపీలోని కొందరి మాట. ఇలాంటి ఏకపక్ష సభను గతంలో ఎప్పుడూ చూడలేదనేది సీనియర్ నేతల మాట.

