“ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం?” అనేది మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానంలో మాట. దేశ చరిత్రలు అనే ప్రసిద్ధ కవితలోని ఏ పంక్తి. నిజానికి ఇదో ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు అదే మహాప్రస్థానంలో సమాధానం కూడా ఉంది. “నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణంత్వం” అని చెప్పారు. అంటే.. ఏ దేశ చరిత్రను పరిశీలించినా గొప్పగా గర్వించదగిన అంశం ఏముందనే ప్రశ్నకు మానవ చరిత్ర అంతా ఇతరులను బాధించడం, దోచుకోవడం, యుద్ధాలు, ఆధిపత్యాలతోనే నిండి ఉందని విమర్శిస్తారు. ఇది ఆనాటి మాట. కానీ ఇప్పటికీ ఇది సరిగ్గా సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే.. ఎప్పటికీ. ఆ రోజు మహా కవి శ్రీశ్రీ ఈ మాట దేశాల మధ్య ఆధిపత్యపోరును ప్రస్తావించగా.. ఈ మాట ఈ రోజు ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల తీరుకు సరిగ్గా సరిపోతుంది.
Also Read : భారీగా పెరిగిన ఏపీ ఆదాయం.. !
ఏ దేశ చరిత్ర చూచినా.. అనే మాట.. ఇప్పుడు ఏ శాఖ చూసినా.. అనేలా మారిపోయింది. అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన, వేగవంతమైన పరిపాలన.. ఇవన్నీ మాటలకే సరిపోయాయా.. అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఇది ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని వ్యవస్థలన్నీ కూడా అవినీతి కూపంలోనే ఉన్నాయి. లంచం.. కాదు కాదు.. నజరానా.. అనే మురికి కూపంలో మునిగి తేలుతున్నాయి. అవినీతి బురదను పూర్తిగా ఒంటికి రాసుకుని.. పైకి మాత్రం నిజాయతీ అనే సెంటు రాసుకుని వ్యవస్థలు సాగుతున్నాయి. ఇందుకు అందమైన మాట.. మాకేం లేదా.. మిమ్మల్ని మర్చిపోయినట్లున్నారు.. అనే మాటలతో తీసుకోవాల్సిన నజరానాలను చాలా మర్యాదగా.. ఇంకా చెప్పాలంటే ముక్కు పిండి మరీ తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవస్థల్లో అది ఇది అనే తేడా లేదు.. రెవెన్యూ మొదలు.. ఏ శాఖలో అయినా సరే.. అవినీతి తాండవిస్తోంది. ప్రతి ప్రభుత్వ విభాగంలో కూడా”లంచం ఇస్తే కానీ మంచం ఎక్కేది లేదు” అనే సామెత మాదిరిగా.. నజరానా ఇస్తే కానీ.. ఫైల్ ముందుకు కదిలే పరిస్థితి లేదు. వాట్సప్ గవర్నన్స్, ఈ – పరిపాలన, పారదర్శకం.. ఇవన్నీ కేవలం మాటలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే.. పైన ఉన్న వారు చెబుతున్న మాటలు. కిందిస్థాయిలో వస్తే మాత్రం.. పది వేల రూపాయల బిల్లు అయినా సరే.. పది కోట్ల రూపాయల బిల్లు అయినా సరే.. కమిషన్ కొట్టు.. బిల్లు పట్టు.. అనేది బహిరంగ రహస్యం.
సాధారణంగా రాజకీయ నేతలపైన అవినీతి ఆరోపణలు రావడం సహజం. ఆ నేత ఇంత తిన్నాడు.. ఈ నేత అంత కూడబెట్టుకున్నాడు.. అని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. అధికారులు మొదలు కిందిస్థాయి ఉద్యోగుల వరకు.. దాదాపు అంతా లంచావతారాలే. నిజాయితీ కలిగిన అధికారి ఎక్కడున్నారని దుర్భిణీ వేసి వెతికినా సరే.. కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఎక్కడో నూటికో కోటికో.. ఒకరో ఇద్దరో తప్ప.. దాదాపు మిగిలిన వారంతా.. నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకే నానా పాట్లు పడుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఇప్పటికే వేలకు వేలు జీతం తీసుకుంటూనే.. లంచం కావాలని డిమాండ్ చేస్తున్నారు. జీతం తీసుకుంటున్నారు కదా.. మళ్లీ ఈ కమిషన్ గోల ఏమిటి.. ఎందుకివ్వాలని ఎవరైనా ఎదిరిస్తే.. జీతం ఆఫీసు కోసం.. మీకు పని కావాలంటే.. మాకు నజరానా ఇవ్వాల్సిందే.. అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. పైగా.. మీరు ఏమైనా నిజాయితీగా పని చేశారా.. అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అధికారి లంచం తీసుకోకుండా ఉంటే.. కాంట్రాక్టర్ కూడా నిజాయితీగానే పని చేస్తాడు కదా.. అనే ప్రశ్నకు మాత్రం జవాబు రావటం లేదు.
Also Read : సంచలన చట్టానికి సిద్ధమైన చంద్రబాబు సర్కార్..!
అధికారుల అవినీతికి ప్రధాన కారణం.. ప్రజా ప్రతినిధులు కూడా. ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవటంతో పాటు వారికి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు తెలుగుదేశం పార్టీ అధినేత. వాళ్లు గెలిచిన తర్వాత పాత వాసన మాత్రం ఇంకా పోలేదు. ఆ నేతలు పైకి పసువు కండువా కప్పుకున్నప్పటికీ.. ఇప్పటికీ పాత సర్కార్లో వ్యవహరించినట్లుగానే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. గెలిచే పార్టీలోనే ఉంటారు. అయినా సరే.. వాళ్ల విధానంలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. వీరి కమీషన్ల కోసం ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకుంటున్నారు కూడా. ఇక్కడ మరో విస్తుగొలిపే విషయం ఏమిటంటే.. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొందరు ప్రైవేటు వ్యక్తులను కూడా వారి అవినీతి సంపాదన కోసం నియమించుకుంటున్నారు. ఇలాంటి వారిలో కొందరు పాత్రికేయులను కూడా భాగస్వామ్యం చేసుకుంటున్నారు.
తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పారదర్శకం, అవినీతి రహిత అనే మాటలు పదే పదే చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలవుతున్నట్లు కనిపించటం లేదు. ఇంకా చెప్పాలంటే.. అది అమలు జరిగేలా చూడాల్సిన కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా.. కమీషన్ల కక్కుర్తితో అవినీతి కూపంలో మునిగితేలుతున్నారు. ఎప్పుడో పని చేసిన బిల్లు కోసం కూడా కాంట్రాక్టర్లు రోజులు, నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కూడా. ఇప్పటికైనా ఇలాంటి అవినీతి పరులకు, లంచావతారులకు ప్రభుత్వం చెక్ పెట్టకపోతే.. ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. ఇలాంటి వారిని నియంత్రిస్తేనే.. తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశం వస్తుంది. లేదంటే.. శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమంటున్నారు రాజకీయ విమర్శకులు.


