వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఆదాయపు పన్ను శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి బినామీ ఆస్తులపై హైదరాబాద్లోని ఐటీ బినామీ లావాదేవీల నిరోధక విభాగం దృష్టి సారించింది. దర్యాప్తులో భాగంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పరిధిలో గుర్తించిన ఒక విలాసవంతమైన విల్లాతో పాటు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.3.5 కోట్ల నగదును అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు.
Also Read : ఎవరి బీ టీమ్ కాదు.. హామీ ఇస్తున్నా..!
ఐటీ శాఖ విచారణలో అక్రమ నిధుల మళ్లింపుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం సరఫరా సంస్థల నుండి సేల్స్ ప్రమోషన్ కమీషన్ ముసుగులో వచ్చిన కోట్లాది రూపాయల ముడుపులను వాసుదేవరెడ్డి తన బావమరిది మారెళ్ల విజయనరసింహారెడ్డి సంస్థల ఖాతాల్లోకి మళ్లించి, ఆ సొమ్ముతో తుక్కుగూడలో ఈ విల్లాను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తు సంస్థల నిఘా పెరగడంతో ఆస్తిని కాపాడుకునేందుకు ఇటీవల దానిని వాసుదేవరెడ్డి భార్య పేరిట బదిలీ చేసినట్లు తేలడంతో, ఈ ఆస్తికి అసలు లబ్ధిదారుడు వాసుదేవరెడ్డేనని నిర్ధారించిన ఐటీ శాఖ జప్తు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్లే హీరోలు..!
అక్రమ సంపాదనతో బినామీల పేరిట ఇంకెన్ని ఆస్తులు కూడబెట్టారనే కోణంలో ఐటీ శాఖ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. కేవలం వాసుదేవరెడ్డి మాత్రమే కాకుండా, ఈ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర కీలక నిందితులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఆస్తుల చిట్టాపై కూడా అధికారులు గురిపెట్టారు. త్వరలోనే మరికొందరు నిందితుల బినామీ ఆస్తులపై కూడా ఇదే తరహా జప్తు చర్యలు ఉండే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాల ద్వారా తెలుస్తోంది.


