ఫిట్నెస్ ప్రియులకు జిమ్ లేదా రన్నింగ్ ఎంత ముఖ్యమో, వ్యాయామం తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడం కూడా అంతే ముఖ్యం. సాధారణంగా రికవరీ అనగానే మంచి ప్రోటీన్ ఆహారం, హైడ్రేషన్, సరైన నిద్ర గురించి మాట్లాడుకుంటారు. అయితే, ప్రస్తుత రోజుల్లో మన నగరాల్లో పెరుగుతున్న గాలి కాలుష్యం కూడా కండరాల రికవరీని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : మిడ్‌టర్మ్ ఎన్నికల ఓటమిపై డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!
ముఖ్యంగా గాలి నాణ్యత సూచీ దారుణంగా పడిపోతున్న తరుణంలో, బహిరంగ ప్రదేశాల్లో తీవ్రమైన వ్యాయామాలు చేయడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యంతో పాటు శరీర అంతర్గత వ్యవస్థ కూడా దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. తీవ్రమైన వర్కవుట్ చేస్తున్నప్పుడు కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ అందించడం కోసం మనం సాధారణం కంటే వేగంగా, లోతుగా శ్వాస తీసుకుంటాము. ఈ క్రమంలో గాలిలో ఉండే అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మ కణాలు పెద్ద మొత్తంలో మన ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి.
ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవిశేఖర్ ఝా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కాలుష్య కణాలు ఊపిరితిత్తులకే పరిమితం కాకుండా శరీరం మొత్తంలో తీవ్రమైన వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ప్రేరేపిస్తాయి. వ్యాయామం వల్ల అలసిపోయిన కండరాలకు, కాలుష్యం వల్ల వచ్చే ఈ అంతర్గత ఒత్తిడి తోడైతే కండరాల రికవరీ ప్రాసెస్ చాలా నెమ్మదిస్తుంది మరియు విపరీతమైన శారీరక అలసటకు దారితీస్తుంది. కండరాల రికవరీ దెబ్బతినకుండా ఉండటానికి గాలి నాణ్యత దారుణంగా ఉన్నప్పుడు రన్నింగ్, సైక్లింగ్ వంటి అవుట్డోర్ వ్యాయామాలను నిలిపివేసి, ఇండోర్ వర్కవుట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : బ్రేకింగ్: ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!
ఇండోర్ లో వ్యాయామం చేసేటప్పుడు కూడా మంచి వెంటిలేషన్, ఎయిర్ ఫిల్టర్లు ఉన్న జిమ్‌లను ఎంచుకోవడం మంచిది. ఒకవేళ రన్నింగ్ లేదా వర్కవుట్ చేస్తున్నప్పుడు అసాధారణంగా ఊపిరి ఆడకపోవడం, నిరంతరంగా దగ్గు రావడం లేదా ఛాతీలో బిగుతుగా అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్య ఒత్తిడిని శరీరం తట్టుకోవడానికి వీలుగా రోజుకు సరిపడా నీరు తాగడం, సమతుల్య ఆహారం మరియు 7-8 గంటల పక్కా నిద్రను అలవాటు చేసుకోవాలి.


