అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజన ఉంటుందనేది కేంద్ర పెద్దల మాట. ప్రస్తుతమున్న సీట్ల సంఖ్య మరో 50 శాతం పెరుగుతుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. దీంతో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని.. అలాగే ప్రస్తుతమున్న నియోజకవర్గాల పరిధి కూడా మారుతుందనే విషయంపై ప్రస్తుత ప్రజా ప్రతినిధులకు, రాజకీయ పార్టీల నేతలకు స్పష్టత ఉంది. అయితే ఇదే సమయంలో చాలా మంది నేతల్లో ఓ భయం కూడా కనిపిస్తోంది. తమ నియోజకవర్గం ఉంటుందా.. పోతుందా.. ఉంటే రిజర్వేషన్ పరిధిలోకి వస్తుందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!
నియోజకవర్గాల పునర్విభజన చర్చలు వేగం పుంజుకోవడంతో ఎమ్మెల్యేల రాజకీయ దృష్టి మారుతోంది. భవిష్యత్ అనిశ్చితి నేపథ్యంలో ప్రజల మధ్య కంటే వ్యక్తిగత వ్యాపారాలపైనే ఎక్కువ దృష్టి పెదుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు గడిచినా, ప్రజాప్రతినిధుల పనితీరుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత వ్యాపారాలు, వ్యవహారాల్లోనే ఎక్కువగా నిమగ్నమై ఉన్నారని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ప్రజలకు చేరువ కావాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో టికెట్లు కష్టమవుతాయని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ హెచ్చరికల మధ్య కూడా చాలా మంది నాయకుల వ్యవహార శైలి మారలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు నేతలు కేవలం మొక్కుబడిగా మాత్రమే తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా, మరికొందరు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే, నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో కొత్తగా నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉండగా, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల రూపురేఖలు పూర్తిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మండలాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ స్థానాల మార్పులు కూడా చోటుచేసుకునే అవకాశముందని అంచనా.
Also Read : భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!
ఈ నేపథ్యంలో “ఇప్పుడే నియోజకవర్గంలో తిరిగి ప్రయోజనం ఏముంది? రేపటికి అదే నియోజకవర్గం ఉంటుందో లేదో తెలియదు” అన్న భావన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో పెరుగుతోందని సమాచారం. దీంతో ప్రజా సేవకంటే వ్యక్తిగత వ్యాపారాలపై దృష్టి మళ్లిస్తున్నారన్న విమర్శలు బలపడుతున్నాయి. రానున్న ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉండటంతో, చాలా మంది నాయకులు ముందస్తు జాగ్రత్తగా తమ ఆర్థిక వ్యవహారాలను బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా పునర్విభజన ప్రక్రియ రాజకీయ నాయకులకు ఒక విధంగా ‘సౌకర్యం’గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

