Thursday, September 24, 2026 02:24 PM
Thursday, September 24, 2026 02:24 PM

టీచర్లను కొట్టినా 24 గంటల్లో బెయిల్..!

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసనల పేరిట చేసిన రచ్చ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడించి, అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, పోలీసులతోనే వాగ్వాదానికి దిగి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. ఈ ఉదంతంపై అటు కూటమి ప్రభుత్వం, ఇటు పోలీసు శాఖ చాలా సీరియస్‌గా బిల్డప్ ఇచ్చాయి. ఏకంగా నిందితులపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ గంభీర ప్రకటనలు చేశారు.

Also Read : పిఠాపురంలో పవన్ మార్క్.. గంటల్లో సమస్యలు పరిష్కారం..!

తీరా కట్ చేస్తే.. మాచవరం పోలీసులు అరెస్ట్ చేసిన 30 మందిలో ఏకంగా 28 మందికి కోర్టు 24 గంటలు తిరగకముందే బెయిల్ మంజూరు చేసింది. కేవలం ఇద్దరిని మాత్రమే రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ కార్యాలయం వద్ద అంతలా రోత చేసినా ఇంత సులభంగా బెయిల్‌పై బయటకు వచ్చేస్తుంటే.. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అంటే భయం ఎక్కడుంది..? చట్టం అంటే లెక్క ఎక్కడుంది..? చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు.. తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హామీలు ఇచ్చారు.

కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తే ఆ మాటలన్నీ నీటిమూటలని స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆస్తులను, శాంతిభద్రతలను పాడుచేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తించిన వారు కూడా దర్జాగా బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. పోలీసులు కోర్టులో కేసును బలంగా వాదించలేకపోయారా..? లేక బలహీనమైన సెక్షన్లతో కేసును కావాలనే నీరుగార్చారా..? అనే అనుమానాలు ఇప్పుడు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి లూజ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల తప్పు చేసే వాళ్లకు ప్రభుత్వం అన్నా, పోలీసులన్నా భయం ఎలా ఉంటుంది..?

Also Read : లోకల్ వార్.. ఓట్ షేర్ పెరుగుతుందా.. తగ్గుతుందా..?

ఒకవైపు 51 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని ప్రెస్ మీట్లలో సిపి రాజశేఖర్ బాబు భారీ ప్రకటనలు చేస్తుంటే.. మరోవైపు కోర్టులో మాత్రం పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులకు వెంటనే రిలీఫ్ వచ్చేస్తోంది. అంటే పోలీసుల దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయా..? లేదా పక్కా ఆధారాలు లేకుండానే కేవలం రాజకీయ కంటితుడుపు చర్యల కోసమే అరెస్టులు చూపిస్తున్నారా..? ఒకవేళ నిందితులు అంతటి తీవ్రమైన నేరానికి ఒడిగడితే, వారిని రిమాండ్‌కు పంపేలా పోలీసులు కోర్టులో సరైన ఆధారాలు ఎందుకు సమర్పించలేకపోయారు? ఇవన్నీ చూస్తుంటే కూటమి ప్రభుత్వం కేవలం ప్రెస్ మీట్లలో హెచ్చరికలకే పరిమితం అవుతోందని, క్షేత్రస్థాయిలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్ అయిందని స్పష్టమవుతోంది అని విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పల్నాడులో వైసీపీ...

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో...

భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!

విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్...

పిఠాపురంలో పవన్ మార్క్.....

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉప...

శీనన్న.. ఇలా అడ్డంగా...

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి....

ఖైరతాబాద్.. గులాబీ పార్టీకి...

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత...

ఏపీ పోలీసులకు జగన్...

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల...

పోల్స్