భారతీయ వంటకాల్లో దేశీ నెయ్యికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పప్పు, వేడివేడి అన్నం, రోటీలపై నెయ్యి వేసుకుని తినడం మనకు అలవాటు. ఆయుర్వేదంలోనూ నెయ్యి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. అయితే, అమృతం లాంటి నెయ్యి కూడా మోతాదు మించితే గుండెకు పెను ముప్పుగా మారుతుందని అపోలో హాస్పిటల్స్ సీనియర్ డైటీషియన్ వర్షా గోరే, కార్డియాలజిస్ట్ డాక్టర్ చరణ్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. కేవలం 100 గ్రాముల నెయ్యిలో సుమారు 62 శాతం సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.
Also Read : జగన్‌కు ఊహించని షాక్ ఇస్తున్న లోకేష్..!
అలాగే ఇది దాదాపు 883 కిలో క్యాలరీల భారీ శక్తిని కలిగి ఉంటుంది. నెయ్యి తనంతట తాను ప్రమాదకరం కాదు, కానీ రోజూ తెలియకుండానే మనం తినే పరిమాణమే అసలైన విలన్. పప్పులో ఒక చెంచా, అన్నంలో మరో చెంచా, రోటీలపై ఇంకొంచెం.. ఇలా రోజంతా లెక్కలేకుండా నెయ్యిని వాడటం వల్ల శరీరంలో సాచురేటెడ్ ఫ్యాట్ మోతాదు విపరీతంగా పెరిగిపోతుంది. మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ అందినప్పుడు, కాలేయం రక్తంలోని కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా శుభ్రం చేయలేకపోతుంది.
ఆ అదనపు కొవ్వు ఎక్కడికీ పోకుండా.. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనుల గోడలపై పేరుకుపోతుంది. దీనివల్ల కాలక్రమేణా ధమనులు ఇరుకుగా మారి, గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ ఆసియా శరీర తత్వం ప్రకారం, పైకి సన్నగా కనిపించినా లోపల కొవ్వు పేరుకుపోయే గుణం ఎక్కువ. అందుకే ఆసియన్లకు బి.ఎమ్.ఐ పరిమితి 23 దాటితేనే ఓవర్ వెయిట్ కింద లెక్కగడతామని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి శరీర తత్వానికి తోడు లెక్కలేకుండా నెయ్యి తింటే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే.
Also Read : ఐఫోన్ యూజర్లకు యాపిల్ పరిహారం చెల్లిస్తుందా..?
వైద్యుల నివేదిక ప్రకారం, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ పరిమితంగా తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన పెద్దలు రోజుకు 1 నుండి 2 టీస్పూన్ల నెయ్యిని సురక్షితంగా తీసుకోవచ్చు. అయితే, గుండె జబ్బులు, మధుమేహం, లేదా హై కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యి వాడకాన్ని రోజుకు కేవలం ఒక టీస్పూన్‌కు మాత్రమే పరిమితం చేయాలి. మిగిలిన వంటకాలకు ఆవ నూనె, వేరుశెనగ లేదా నువ్వుల నూనెలను వాడటం మంచిది. నెయ్యిని వంట చేసేటప్పుడు కాకుండా.. వంట పూర్తయ్యాక కేవలం రుచి మరియు సువాసన కోసం చివర్లో కొద్దిగా వాడటం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల నెయ్యి తిన్న తృప్తి లభిస్తుంది, గుండెకు ముప్పూ తప్పుతుంది. సాంప్రదాయాన్ని, గుండె ఆరోగ్యాన్ని రెండింటినీ కాపాడుకోవాలంటే నెయ్యిని కొలిచి వాడటమే అసలైన పరిష్కారం.

