యాపిల్ సంస్థ తన ఐఫోన్ వినియోగదారులకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించడానికి అంగీకరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యాపిల్ తన సరికొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రకటనలలో అడ్వాన్స్డ్ సిరి ఫీచర్లను పూర్తిగా పనిచేస్తున్నట్లు చూపించి, ఆ తర్వాత వాటి లాంచ్‌ను ఆలస్యం చేసింది. దీనివల్ల వినియోగదారులు మోసపోయారంటూ అమెరికాలో దాఖలైన ఒక క్లాస్-యాక్షన్ లాసూట్ సెటిల్మెంట్లో భాగంగా యాపిల్ సంస్థ ఏకంగా 250 మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వడానికి ఒప్పుకుంది.
Also Read : తప్పు చేసి కొత్త డ్రామాకు తెరలేపిన జగన్..?
ఈ నేపథ్యంలో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఈ ఆలస్యం వల్ల నష్టపోయిన భారత ఐఫోన్ వినియోగదారులకు కూడా యాపిల్ సంస్థ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిహార ఒప్పందం ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఐఫోన్ పరికరానికి కనీసం 25 డాలర్ల నుండి గరిష్టంగా 95 డాలర్ల వరకు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 2,000 నుండి రూ. 8,000 వరకు యాపిల్ చెల్లించనుంది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతానికి కేవలం అమెరికా నివాసితులకు మాత్రమే వర్తిస్తుంది.
జూన్ 10, 2024 నుండి మార్చి 29, 2025 మధ్య కాలంలో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే ఐఫోన్ మోడళ్లను కొనుగోలు చేసిన వారు మాత్రమే ఈ క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు. ఇందుకోసం ఇప్పటికే సెప్టెంబర్ 21 నుండి ఒక ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. అక్కడ వినియోగదారులు తమ పరికరాల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24, 2027న కోర్టు దీనిపై తుది నిర్ణయం తీసుకున్న అరవై రోజుల తర్వాత ఈ చెల్లింపులు ప్రారంభమవుతాయి. విజయ్ శేఖర్ శర్మ చేసిన ఈ ట్వీట్‌పై భారతీయ నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
Also Read : గులాబీ కోటలే రేవంత్ టార్గెట్..!
ఇలాంటి చట్టపరమైన పరిహారాల విషయంలో భారతీయులు ఎప్పుడూ వెనుకబడే ఉంటున్నారని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో వినియోగదారుల హక్కుల రక్షణ కోసం అంతర్జాతీయ స్థాయి కంపెనీలపై ఉమ్మడి దావాలు వేసే బలమైన చట్టపరమైన వ్యవస్థ గానీ, లేదా గెలిచిన తర్వాత ఆ డబ్బును వినియోగదారులకు సులభంగా పంపిణీ చేసే మౌలిక సదుపాయాలు గానీ లేకపోవడం మైనస్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తరహాలోనే భారతదేశంలో కూడా వినియోగదారుల హక్కుల కోసం ఒక ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ రావాల్సిన అవసరం ఉందని ఈ వివాదం మరోసారి గుర్తు చేస్తోంది.

