భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌లను జట్టులో ఆడిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే సిరీస్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అయిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని తుది జట్టు నుంచి తొలగించి, సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వడం పట్ల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో శాంసన్ కేవలం 10 పరుగులకే అవుటవడంతో గంభీర్ వ్యూహం ఫలించలేదు.
Also Read : బ్రేకింగ్: బెజవాడలో హైఅలెర్ట్.. బస్టాండ్ లో భారీగా పేలుడు పదార్ధాలు
సూర్యవంశీని జట్టు నుంచి తొలగించడంపై క్రీడాభిమానులతో పాటు తన ఇంట్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చారు. “గత మ్యాచ్‌లో సూర్యవంశీ ఆడకపోవడంతో మేం టీవీ కట్టేసి సినిమా చూశాం. గత సిరీస్‌లో అద్భుతంగా ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అయిన ఆటగాడిని ఎలా పక్కన పెడతారంటూ నా భార్య నాపైనే అరిచేసింది” అని శ్రీకాంత్ సరదాగా వ్యాఖ్యానిస్తూనే సీరియస్ విషయాన్ని లేవనెత్తారు. ఇలాంటి నిర్ణయాలు యువ ఆటగాళ్ల మనస్సులో ఆందోళనలను పెంచుతాయని, తదుపరి మ్యాచ్‌లో స్కోరు చేయకపోతే ఎక్కడ జట్టు నుంచి తీసేస్తారోననే భయం వారిలో మొదలవుతుందని హెచ్చరించారు. దులీప్ ట్రోఫీ, ఐపీఎల్, ఇండియా-ఎ తరఫున అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న సూర్యవంశీని మేనేజ్‌మెంట్ ప్రోత్సహించాల్సింది పోయి తప్పుడు సంకేతాలు పంపుతోందని మండిపడ్డారు.
Also Read : బ్రేకింగ్: ఏపీ మాజీ మంత్రి కన్నుమూత
యువ ఆటగాడి గురించే కాకుండా సంజూ శాంసన్ విషయంలోనూ జట్టు యాజమాన్యం అనుసరిస్తున్న తీరు సరిగ్గా లేదని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన శాంసన్‌ను స్థిరంగా జట్టులో కొనసాగించకుండా ఇన్ అండ్ అవుట్ విధానాన్ని అవలంబిస్తున్నారని విమర్శించారు. “ఈ మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్ కెరీర్‌తో ఆడుకుంటోంది. శాంసన్‌ను చూస్తే నాకు జాలేస్తోంది. ఎవరికైనా వరుసగా కొన్ని మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇవ్వాలి, అంతే కానీ అక్కడ రెండు మ్యాచ్‌లు, ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఇస్తే ఏ ఆటగాడూ రాణించలేడు” అని శ్రీకాంత్ హితవు పలికారు. అఫ్గానిస్తాన్‌తో జరిగే తదుపరి టీ20 మ్యాచ్‌లోనైనా సూర్యవంశీకి అవకాశం ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

