స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఎక్కడ పార్టీ బలంగా ఉంది? ఏ స్థానాల్లో తప్పనిసరిగా పోటీ చేయాలి? ఎక్కడ మిత్రపక్షాలతో సమన్వయం అవసరం? అనే అంశాలపై క్షేత్రస్థాయి అంచనాలు వేస్తోంది. ఇందుకోసం రాష్ట్రస్థాయి కమిటీతో పాటు కింది స్థాయిలోనూ పలు కమిటీలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారు. ఇటీవల మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ కమిటీల సభ్యులతో పాటు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చురుకుగా పనిచేసిన నేతలతో కీలక సమావేశం జరిగింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రామ్ తాళ్లూరి ఇతర ముఖ్య నేతలు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. దీంతో స్థానిక పోరులో జనసేన భారీగానే బరిలోకి దిగబోతోందన్న సంకేతాలు వెలువడ్డాయి.
Also Read : కూటమిలో సీట్ల పంచాయతీ.. తెగుతుందా.. లేదా..?
అయితే జనసేన దూకుడును టీడీపీ నేతలు మరో కోణంలో చూస్తున్నారు. జనసేన ఏర్పాటు చేసిన కమిటీలు తమ బలాబలాలను అంచనా వేసి నివేదికలు ఇవ్వడం ఒక ఎత్తయితే.. ఆ నివేదికల ఆధారంగా సీట్లు కేటాయించడం మరో ఎత్తని అంటున్నారు. “ఫలానా చోట మాకు బలం ఉంది.. ఇక్కడ పోటీ చేస్తాం” అని జనసేన నేతలు చెప్పినంత మాత్రాన సీటు ఖరారైనట్టు కాదని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జనసేన చెబుతున్న బలం వాస్తవమైనదా? క్షేత్రస్థాయిలో నిజంగానే గెలిచే పరిస్థితి ఉందా? లేక పార్టీ శ్రేణుల ఉత్సాహంలో చెప్పుకుంటున్న లెక్కలేనా? అనేది తేలాల్సి ఉందని అంటున్నాయి.
జనసేన కమిటీలు త్వరలో పవన్ కల్యాణ్‌కు తమ నివేదికలు అందించనున్నాయి. ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ స్థానిక సంస్థలో పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్న దానిపై ఈ నివేదికలు స్పష్టత ఇవ్వనున్నాయి. అయితే ఆ నివేదికలు వచ్చిన తర్వాత కూడా సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం మిత్రపక్షాల అధినేతలదేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేశ్ పరిస్థితులను పరిశీలించి.. గెలుపు అవకాశాలను బేరీజు వేసిన తర్వాతే సీటు కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అంటే.. జనసేన కమిటీ ఒక చోట బలం ఉందని నివేదిక ఇచ్చిందంటే అక్కడ జనసేనకే సీటు దక్కుతుందని అనుకోవడానికి లేదన్న మాట.
Also Read : బాబు పోలవరం Vs కేసీఆర్ కాళేశ్వరం.. ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు
జనసేన ప్రస్తుతం చేస్తున్న హడావుడిని తాము గమనిస్తున్నామని టీడీపీ నేతలు అంటున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడం, నేతల్లో ఉత్సాహం నింపడం కోసమే జనసేన నాయకత్వం పెద్ద ఎత్తున పోటీపై మాట్లాడుతోందని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మిత్రపక్షాలకు ఎన్ని స్థానాలు ఇవ్వాలి? ఏ ప్రాంతాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? అన్నదానిపై టీడీపీ నాయకత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిందన్న ప్రచారం కూడా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అందువల్ల జనసేన కమిటీల నివేదికలు ఒక సూచన మాత్రమే.. సీట్ల కేటాయింపుపై తుది తీర్పు మాత్రం కూటమి పెద్దలదే అన్న సంకేతాలను టీడీపీ వర్గాలు ఇస్తున్నాయి. స్థానిక ఎన్నికల సమరానికి జనసేన ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినా.. అసలు పరీక్ష మాత్రం “ఎన్ని సీట్లు అడుగుతుంది?” కంటే “ఎన్ని సీట్లు సాధిస్తుంది?” అన్నదే. ఇక మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు సమయంలో జనసేన తన బలాన్ని ఏ మేరకు నిరూపించుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

