Tuesday, September 8, 2026 04:37 PM
Tuesday, September 8, 2026 04:37 PM

విజయసాయి కొత్త ‘దారి’ జగన్ కి బీ-టీంగా మారుతుందా?

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. విజయవాడ వేదికగా ఆయన పార్టీ పేరు, ఎజెండా ప్రకటిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడూ ఒక కొత్త మలుపు కోసం రెడీగా ఉంటుంది. దశాబ్దాలుగా రెండు ప్రధాన సామాజిక, రాజకీయ ధ్రువాల చుట్టూ తిరిగే రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త సమీకరణం తెరపైకి వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ద్వితీయ నాయకుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read : అప్పటి వరకు సభకు వచ్చేది లేదు..!

2025లో రాజకీయ వైరాగ్యంతో ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికిన ఆయన, ఇప్పుడు మళ్లీ ‘మూడో ప్రత్యామ్నాయం’ నినాదంతో రీ-ఎంట్రీ ఇవ్వడం కేవలం ఉనికి కాపాడుకునే ప్రయత్నమా లేక ముందస్తు వ్యూహమా అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ రెండూ ఫ్యాక్షన్ రాజకీయాలకే పరిమితమయ్యాయని, ప్రజలకు కొత్త రాజకీయ వేదిక అవసరమన్నది విజయసాయి రెడ్డి వాదన. యువత, మేధావుల భాగస్వామ్యంతో సరికొత్త ఎజెండాతో వస్తామని ఆయన చెబుతున్నారు. అయితే, ఏపీ రాజకీయం ఎప్పుడూ రెండు బలీయమైన పక్షాల మధ్యే కేంద్రీకృతమై ఉందన్నది చారిత్రక సత్యం. గతంలో చిరంజీవి నిర్మించిన ప్రజా రాజ్యం, ఆ తదుపరి పవన్ కళ్యాణ్ జనసేన వంటి బలమైన సామాజిక పునాది ఉన్న పార్టీలే మూడో ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

అటువంటి పరిస్థితుల్లో, సొంత సామాజిక ఓటు బ్యాంకు లేదా క్షేత్రస్థాయి కేడర్ బలం స్పష్టంగా లేని ఒక నాయకుడు స్వతంత్రంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం అంత సులభమైన విషయమేమీ కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో విజయసాయి రెడ్డికి ఉన్న ఆర్థిక, రాజకీయ, చట్టపరమైన అనుబంధం సాధారణమైనది కాదు. వైసీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో పార్టీ తరఫున కీలక పాత్ర పోషించడం వరకు ఆయన ముద్ర స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యాన్నే విమర్శకులు ప్రధానాస్త్రంగా మలుస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను లేదా ప్రభుత్వంపై వచ్చే అసంతృప్తి ఓట్లను వైఎస్సార్‌సీపీ వైపు కాకుండా, ఇతర వైపు మళ్లించే వ్యూహంలో భాగంగానే ఈ ప్రయత్నం జరుగుతుందనేది ప్రత్యర్థుల ఆరోపణ.

Also Read : ఏపిలో కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!

ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, విశాఖపట్నం పరిధిలో కొన్ని వర్గాల ఓట్లను చీల్చడం ద్వారా ఎన్నికల సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. మరో కోణంలో చూస్తే, వైసీపీలో తనకు ప్రాధాన్యత తగ్గడం, పార్టీ నాయకత్వంతో వచ్చిన విభేదాల కారణం గానే ఆయన బయటకు వచ్చారనేది జగద్విదితం. పార్టీ బాధ్యతల నుంచి పక్కన పెట్టడం, ఆపై పదవులకు రాజీనామా చేయడం వంటి పరిణామాలు ఆయనను ఆత్మరక్షణలో పడేశాయి. ఈ క్రమంలో రాజకీయంగా తాను ఇంకా చెల్లుబాటు అయ్యే నాయకుడినేనని నిరూపించుకోవడానికి, తన ఉనికిని చాటుకోవడానికి ఇది ఒక ప్రయత్నం కావచ్చు.

రాజకీయాల్లో నాయకుల ప్రకటనల కంటే వారి తదుపరి కార్యాచరణే అసలు ఉద్దేశాలను స్పష్టం చేస్తుంది. విజయసాయి రెడ్డి పెట్టబోయే పార్టీ నిజంగానే రెండు ప్రధాన పార్టీలకు సమాన దూరంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుందా? లేక ఎన్నికల సమయానికి ఎవరి ప్రయోజనాలకో పరోక్షంగా ఉపకరిస్తుందా? అనేది ఆయన ఎంచుకునే సైద్ధాంతిక బాట, చేసే విమర్శల తీవ్రతను బట్టే తేలుతుంది. ఏది ఏమైనా, ఒకప్పటి అధికార పార్టీ కీలక సూత్రధారి ఇప్పుడు స్వతంత్ర పాత్ర పోషించాలనుకోవడం ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర అధ్యాయానికి శ్రీకారంగా భావిస్తున్నారు.

Also Read : మైండ్ గేమ్ ఆడుతున్న మేధావులు..!

జగన్ ‌రెడ్డి నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే.. నా శత్రువు కాదు..! జగన్ కి వ్యతిరేకంగా నేనేమీ పార్టీని పెట్టలేదు. ఈ మాటలన్నది ఎవరో కాదు.. విజయసాయిరెడ్డి. తన ప్రెస్ మీట్ లో అడుగడుగునా… జగన్ ని కాపాడే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోంది. 2025 జనవరిలో రాజ్యసభ పదవికి, రాజకీయాలకు రాజీనామా చేస్తూ “ఇకపై వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలకు దూరం” అని ప్రకటించిన సాయిరెడ్డి, ఏడాదిన్నర తిరగక ముందే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆయన స్థిరత్వానికి ప్రశ్నార్థకంగా మారింది. ఆయన మాటలకు విశ్వసనీయత లేదని అర్థమయింది.

వైఎస్సార్‌సీపీ స్థాపన నుండి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా, A-2గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి.. ఇప్పుడు అదే పార్టీని “ఫ్యాక్షన్, రప్పా రప్పా పార్టీ” అని విమర్శించడం రాజకీయ అవకాశవాదంగా కనిపిస్తుంది. ఏపీ రాజకీయాలు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల చుట్టూనే తిరుగుతున్నాయని, ఇతర కులాలకు అవకాశం ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. బలమైన సామాజిక పునాది లేదా క్షేత్రస్థాయి క్యాడర్ లేకుండా కేవలం “కులాధిపత్య వ్యతిరేక” నినాదంతో ఓట్లను సాధించడం ఏపీలో అత్యంత క్లిష్టం.

తాను సీఎంగా ఉండనని, బాల్ థాకరే తరహాలో రిమోట్ కంట్రోల్‌గా వ్యవహరిస్తానని చెప్పడం ద్వారా పార్టీపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూనే, జవాబుదారీతనం నుంచి తప్పుకునే ధోరణి కనిపిస్తోంది. ఉచిత విద్యుత్ ఇస్తానని.. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా సోలార్ విధానంలో ప్రజలే విద్యుత్ విక్రయించేలా ఉచిత విద్యుత్ ఇస్తాననడం వినడానికి బాగున్నా, దీని సాంకేతిక, ఆర్థిక అమలుపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేదు. గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిని తీవ్రంగా వ్యతిరేకించిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు “అమరావతే రాజధాని, దాన్ని వ్యతిరేకించడం అవివేకం” అని అనడం ఆయన అవకాశవాద రాజకీయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఏపీలో ఇప్పటికే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఒకవైపు, వైఎస్సార్‌సీపీ మరోవైపు బలంగా ఉన్నాయి. మూడో ప్రత్యామ్నాయంగా వచ్చే కొత్త పార్టీ ఏ వర్గం ఓట్లను చీలుస్తుందనేది కీలకం. వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును దెబ్బతీయకుండా ఉండేందుకు.. కూటమి వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రయత్నమే ఇదంటున్నారు. \విజయసాయిరెడ్డి ప్రకటనలు సిద్ధాంతపరంగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఆయన గత రాజకీయ నేపథ్యం, సీనియర్ నాయకుడిగా వైఎస్సార్‌సీపీ నిర్ణయాల్లో వహించిన పాత్ర దృష్ట్యా ప్రజలు ఆయనను అసలు నమ్మే అవకాశం లేదంటున్నారు. దసరాకు పార్టీ పేరు ఎజెండా ప్రకటిస్తాననడం వెనక ఏదో వ్యూహం ఉందంటున్నారు. వైసీపీ ఏ పార్టీ పెట్టినా.. జగన్ బీ-టీంగానే అది పనిచేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

-జి.సత్యనారాయణరాజు

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైఎస్ వివేకా హత్య...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య...

లోకల్ వార్.. ఎవరికి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు...

మెగా ఫ్యామిలీకి వరుసగా...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర...

ఎల్పీజీ వినియోగదారులకు గుడ్...

ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కేంద్ర...

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ కు...

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా మునుపెన్నడూ లేని...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను వేటాడిన...

తెలంగాణ శాసనసభ వేదికగా సోమవారం చోటుచేసుకున్న...

పోల్స్