Tuesday, September 8, 2026 03:53 PM
Tuesday, September 8, 2026 03:53 PM

లోకల్ వార్.. ఎవరికి రెఫరెండం..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు రెఫరెండంగా మారతాయా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సర్వే సంస్థలు, ఒపీనియన్ పోల్స్ ఎన్ని వచ్చినా.. గ్రామం నుంచి నగరం వరకు ఓటర్లు నేరుగా తమ ఓటు హక్కును వినియోగించుకునే స్థానిక ఎన్నికల ఫలితాలు మాత్రం క్షేత్రస్థాయి ప్రజాభిప్రాయానికి మరింత దగ్గరగా ఉంటాయన్న అభిప్రాయం ఉంది. అయితే, ఈ పోరును బహిరంగంగా పాలనపై రెఫరెండంగా అంగీకరించేందుకు అధికార కూటమి సిద్దపడుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న.

Also Read : కోల్పోయిన చోటే వెతుక్కున్న ఇషాన్ కిషన్.. ఇది కదా కమ్ బ్యాక్..!

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను తమ ప్రభుత్వ పనితీరుపై రెఫరెండంగా ప్రకటించేందుకు అంతగా ఆసక్తి చూపవు. ఇందుకు ప్రధాన కారణం.. స్థానిక ఎన్నికల స్వభావమే. రాష్ట్రస్థాయి ప్రభుత్వ పనితీరుతో పాటు స్థానిక అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, కుల సమీకరణాలు, స్థానిక సంబంధాలు, ఆర్ధిక ప్రభావం, గ్రామీణ వర్గాల మధ్య ఉన్న సమీకరణాలు వంటి అనేక అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పటికీ.. ఒక సర్పంచ్, ఎంపీటీసీ లేదా కార్పొరేటర్ అభ్యర్థిపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత కారణంగా ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవచ్చు. అందుకే అధికార కూటమి ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామనే థీమా వ్యక్తం చేసినా.. వాటికి ముందుగానే ‘రెఫరెండం’ అనే ముద్ర వేయడం ద్వారా రాజకీయంగా అనవసరమైన రిస్క్ తీసుకునే అవకాశం తక్కువ.

అయితే ప్రైవేటు సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌కు భిన్నంగా స్థానిక ఎన్నికలు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని కొంత స్పష్టంగా ఆవిష్కరించే అవకాశం ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు తర్వాత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల స్పందన ఎలా ఉందన్నది ఈ ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. సూపర్ సిక్స్ హామీల అమలు, పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి అభివృద్ధి, మౌలిక వసతులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. గ్రామీణ, పట్టణ ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపాయన్నది స్థానిక ఫలితాల్లో కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం పట్ల ఉన్న సంతృప్తి లేదా అసంతృప్తి.. స్థానిక అభ్యర్థుల ఎంపిక, పార్టీ సమీకరణాలతో కలిసిపోయి ఓటర్ల తీర్పులో బయటపడుతుంది.

అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రం ఈ ఎన్నికలు మరో విధంగా కీలకం. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలులో జాప్యాన్ని ఎత్తిచూపుతూ.. స్థానిక ఎన్నికలను ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణగా ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే ఈ వాదనను రాజకీయంగా బలంగా వినిపించాలంటే వైసీపీకి కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరిపోదు. క్షేత్రస్థాయిలో ప్రతి పంచాయతీ, ప్రతి వార్డు, ప్రతి స్థానంలోనూ గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత పార్టీ ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. స్థానిక ఎన్నికల్లో తన బలం ఎంత మేర పునరుద్ధరించుకుందో నిరూపించుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది.

టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి కూడా ఈ ఎన్నికలు అంత సులభం ఏమీ కాదు. రాష్ట్రస్థాయిలో మిత్రపక్షాల మధ్య ఉన్న సమన్వయం క్షేత్రస్థాయిలో ఎంతవరకు కొనసాగుతుందన్నది అత్యంత కీలకం. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక.. టికెట్ల కేటాయింపు సమయంలో పార్టీల మధ్య పోటీ, అసంతృప్తి, అంతర్గత విభేదాలు తలెత్తకుండా చూడటం కూటమి నాయకత్వానికి పెద్ద సవాలుగా మారవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి సాధించిన విజయాన్ని స్థానిక స్థాయిలోనూ కొనసాగించగలిగితే.. కూటమి సమన్వయం మరింత బలపడినట్లు అవుతుంది. అదే సమయంలో స్థానికంగా మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుందన్నదీ ఈ ఎన్నికలు తేల్చే అవకాశం ఉంది.

Also Read : ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్..!

అధికార కూటమి ఈ ఎన్నికలను పాలనపై రెఫరెండంగా అంగీకరించకపోవచ్చు. వైసీపీ మాత్రం దానిని రెఫరెండంగా ప్రచారం చేయవచ్చు. కానీ చివరకు రాజకీయ పార్టీల వాదనల కంటే.. బ్యాలెట్ బాక్సుల నుంచి వచ్చే ఫలితాలకే ప్రాధాన్యం ఉంటుంది. కూటమి స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి భారీ విజయాన్ని సాధిస్తే.. అది ప్రభుత్వానికి రాజకీయంగా బలమైన ఆమోదంగా భావించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వైసీపీ గణనీయమైన స్థాయిలో పుంజుకుంటే.. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందనే రాజకీయ చర్చకు అది బలం చేకూర్చవచ్చు. అందుకే అధికారికంగా ఏ పార్టీ అంగీకరించినా, అంగీకరించకపోయినా.. స్థానిక ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి ఒక రకమైన పాలనా గ్రేడింగ్‌గా నిలిచే అవకాశముంది. గ్రామం నుంచి నగరం వరకు ప్రజలు ఇచ్చే తీర్పు.. కూటమి రెండేళ్ల పాలనపై ఉన్న మూడ్‌ను అంచనా వేసేందుకు రాజకీయ పార్టీలకు కీలక సంకేతాలను ఇవ్వనుంది. అంతేకాదు.. ఈ ఫలితాలు 2029 సార్వత్రిక ఎన్నికల దిశగా ఏ పార్టీకి ఎలాంటి వ్యూహం అవసరమో సూచించే పొలిటికల్ రోడ్ మ్యాప్‌కు తొలి సంకేతాలుగా మారే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైఎస్ వివేకా హత్య...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య...

మెగా ఫ్యామిలీకి వరుసగా...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర...

ఎల్పీజీ వినియోగదారులకు గుడ్...

ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కేంద్ర...

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ కు...

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా మునుపెన్నడూ లేని...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను వేటాడిన...

తెలంగాణ శాసనసభ వేదికగా సోమవారం చోటుచేసుకున్న...

డీజీపీ మాటను లెక్క...

స్వయంగా పోలీస్ బాసు రంగంలోకి దిగారు....

పోల్స్