తెలంగాణ శాసనసభ వేదికగా సోమవారం చోటుచేసుకున్న హైడ్రామా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి నిరసనల సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై భరత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటి ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు.
Also Read : విజయసాయి కొత్త ‘దారి’ జగన్ కి బీ-టీంగా మారుతుందా?
ముఖ్యంగా స్పీకర్‌పై కులం పేరుతో దూషణలకు దిగారన్న ఆరోపణలతో ఎమ్మెల్సీ తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సహా పలు కఠినమైన సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ మరియు సైఫాబాద్ పోలీసులు హైదర్‌గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకుని ఫ్లాట్ నెంబర్ 11లో ఉన్న ఎమ్మెల్సీ తాతా మధును అదుపులోకి తీసుకున్నారు.
Also Read : మైండ్ గేమ్ ఆడుతున్న మేధావులు..!
అదే సమయంలో మరో బృందం కోకాపేటలోని నివాసంలో ఉన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుంది. పోలీసులు భారీగా మోహరించి ఈ అరెస్టులు చేయడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్, కోకాపేట పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ, టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతరం ఇద్దరు నేతలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రాథమిక విచారణ జరిపారు. పోలీసుల వెల్లడించిన సమాచారం ప్రకారం, తాతా మధును నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లోనే వీరిద్దరిని నాంపల్లిలోని మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్‌కు కోరనున్నారు.

