రాజకీయాలు అంటే ప్రజా సేవ అంటారు. ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చామంటారు. పదవులు కేవలం అలంకారం మాత్రమే అని చెబుతారు. కానీ ఆ పదవి లేకపోతే మాత్రం.. ముఖం చూపించేందుకు కూడా ముందుకు రారు. కొందరికి పదవి ఉన్నా లేకున్నా.. ప్రజా సేవ ముఖ్యం. మరి కొందరికి ప్రజా సేవ కంటే పదవులే ముఖ్యం. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినా సరే.. రాజకీయ నేతలైనా సరే.. పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తారు. అయితే అది అన్ని వేళలా సాధ్యం కాదు. గెలుపు ఓటములు సహజం. గెలిచినప్పుడు విర్రవీగి.. ఓడినప్పుడు కుంగిపోయిన వాడు అసలు రాజకీయాలకు పనికి రాడు.. అనేది విశ్లేషకుల మాట.
Also Read : చంద్రబాబు సొంత జిల్లాకు పవన్ గిఫ్ట్..!
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే మంత్రి పదవి చేపట్టారు చంద్రబాబు. ఆ తర్వాత జరిగిన 1983 ఎన్నికల్లో ఓడిపోయారు. మంత్రి ఓడిపోయాడని అంతా ఎద్దేవా చేసినా సరే.. ఎక్కడ ఓడిపోయారో.. అక్కడే మళ్లీ గెలిచి చూపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఓడిందే లేదు. అలాగే అనూహ్యంగా 1995లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తొమ్మిదేళ్ల పాటు సీఎంగా కొనసాగారు. పాదయాత్ర ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో.. వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి కుర్చీపై ఆశలు పెట్టుకుని నిరాశ చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల నెరవేరింది. 2004లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు.
Also Read : ఫోటోలు ఫ్లెక్సీల కోసం కొట్టుకోవద్దు: చంద్రబాబు
అయితే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను.. కాబట్టి.. ఓడిన తర్వాత సభకు రాలేను అని చంద్రబాబు ఏ రోజు అనలేదు. చివరికి తన తల్లిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి దూషించినా సరే.. చంద్రబాబు భరించారు. సభకు వచ్చారు. మళ్లీ 2014 ఎన్నికల్లో గెలిచే వరకు ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత వైసీపీ నేతలు ఎన్ని అవమానాలు చేసినా సరే.. చివరికి వయసును ప్రస్తావించినా సరే.. నాలుగేళ్ల పాటు సభకు వచ్చారు. మిగిలిన సభ్యులందరినీ సభ నుంచి సస్పెండ్ చేసినా సరే.. సింగిల్‌గానే ప్రజా సమస్యలపై నాటి వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.
Also Read : ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్.. ఫలించిన పవన్ కృషి
కానీ.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నేతల తీరుపై మాత్రం రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఇద్దరే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఒకరు తొమ్మిదేళ్లు సీఎంగా ఉంటే.. మరొకరు ఐదేళ్లు. ఇద్దరు ఎన్నికల్లో ఓడిపోయారు. మరో విషయం ఏమిటంటే.. పైకి వేరే వేరే పార్టీలు అయినప్పటికీ.. లోపల మాత్రం దోస్తీ గట్టిగానే ఉంది. కేసీఆర్ గెలుపు కోసం అన్నట్లుగా సరిగ్గా ఎన్నికల రోజే నీటి తగాదా అంటూ సాగర్ డ్యామ్ మీదకు జగన్ పోలీసులను పంపారు. జగన్ గెలుపు కోసం తన మంత్రులను, ఎమ్మెల్యేలను ఏపీకి పంపి.. కులాల మధ్య చిచ్చు పెట్టించారు. ఇప్పటికీ టార్గెట్ టీడీపీ అన్నట్లుగా తెలంగాణలో కొందరు మేధావులు జగన్ కోసం వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఎన్నికల్లో ఓడి రెండున్నరేళ్లు దాటినా కూడా.. కేసీఆర్ ఒక్కసారే సభకు వచ్చారు. అది కూడా బడ్జెట్ ప్రసంగానికి మాత్రమే. ఆ రోజు కూడా ఎందుకు అంటే.. సభ్యులకు మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి. ఆ తర్వాత మళ్లీ సభ చుట్టు పక్కల కూడా కేసీఆర్ జాడ లేదు. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కేసీఆర్ సభకు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఇటు జగన్ కూడా గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. మళ్లీ కనిపించలేదు. ఏమైనా అంటే.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారు. మళ్లీ ముఖ్యమంత్రి గానే జగన్ సభకు వస్తారనేది వైసీపీ నేతల మాట. అంటే ఈ ఇద్దరికీ ప్రజా సమస్యల కంటే కూడా.. పదవే ముఖ్యమనే మాట స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

