హైదరాబాద్ జంటనగరాల పరిధిలో రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసే వారికి తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. నైట్ డ్యూటీలు చేసే ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ కంపెనీల్లో నైట్ షిఫ్ట్‌లు ముగించుకుని వచ్చే టెక్కీలు, సివిల్ పనులు చేసుకునే వేలాది మంది రాత్రి పూట రవాణా సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులకు ఆర్టీసీ శాశ్వత పరిష్కారం చూపింది. ఇప్పటివరకు రాత్రి వేళల్లో క్యాబ్‌లు, బైక్ టాక్సీలను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్న జనాభాకు ఊరటనిస్తూ సిటీలో నైట్ బస్ సర్వీసులను అధికారికంగా పునరుద్ధరించింది.
Also Read : మొన్న భోగాపురం.. నిన్న వెలిగొండ.. నేడు ఉత్తరాంధ్రకు పోలవరం జలాలు!
ఆర్టీసీ కొత్త టైమ్ టేబుల్ ప్రకారం.. ఇకపై ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నగరంలోని ప్రధాన రూట్లలో ఈ నైట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే 6 ప్రధాన రూట్లను ఇందుకోసం ఎంపిక చేసి బస్సులను నడుపుతున్నారు. ఉబర్, ఓలా, రాపిడో వంటి ప్రైవేట్ రవాణా సంస్థలు రాత్రి వేళల్లో డిమాండ్ పేరుతో వేసే సర్ఛార్జీల బాదుడుతో బెంబేలెత్తిపోతున్న సామాన్యులకు, మధ్యతరగతి ప్రయాణికులకు ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద రిలీఫ్ అని చెప్పాలి.
Also Read : తెలంగాణా బిజెపిలో ఎంపీల మధ్య రచ్చ.. అసలేం జరిగింది..?
ఈ కొత్త సర్వీసుల వల్ల ప్రయాణికులకు డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా రాత్రి వేళల్లో సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చినట్లయింది. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మరియు ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారికి ఈ రాత్రి బస్సులు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో మరికొన్ని రూట్లకు కూడా వీటిని విస్తరించే యోచనలో అధికారులు ఉన్నారు.

