హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాల వేళ చెరువుల్లో విగ్రహాల నిమజ్జనంపై కొత్త వివాదం చెలరేగింది. హైడ్రా వర్సెస్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మధ్య నిమజ్జన ఆంక్షల వ్యవహారం తీవ్ర రచ్చకు దారితీస్తోంది. తాము ప్రత్యేకంగా పునరుద్ధరించి, అభివృద్ధి చేసిన పర్యావరణ సున్నితమైన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతించేది లేదని హైడ్రా కమిషనర్ స్పష్టం చేయగా, ఎప్పటిలాగే అన్ని చెరువుల్లో నిమజ్జనాలు చేసి తీరుతామని ఉత్సవ సమితి తేల్చి చెప్పింది.
Also Read : ఆటోమొబైల్ రంగంలో సంచలనం.. హోండా, నిస్సాన్ భారీ డీల్..!
ఈ వివాదానికి ప్రధాన కేంద్రంగా మారిన కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిషేధం విధించారు. కేంద్ర ప్రభుత్వం కాప్రా చెరువును కీలకమైన అర్బన్ వెట్‌లాండ్‌గా గుర్తించిందని, ఇక్కడికి విదేశాల నుంచి వందలాది వలస పక్షులు వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల పర్యావరణాన్ని రక్షించేందుకు ఈ చెరువులో నిమజ్జనాలు కుదరవని, చిన్న విగ్రహాల కోసం పక్కనే ఉన్న బేబీ పాండ్ ను వాడుకోవాలని, పెద్ద విగ్రహాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని హైడ్రా సూచించింది.
హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు తీవ్రంగా మండిపడుతున్నారు. భక్తుల శతాబ్దాల నాటి సెంటిమెంట్లు, విశ్వాసాలతో ముడిపడి ఉన్న నిమజ్జన కార్యక్రమాన్ని అడ్డుకునే లేదా నిలిపివేసే సంపూర్ణ అధికారం హైడ్రాకు ఎంతమాత్రం లేదని సమితి స్పష్టం చేసింది. గత కొన్ని దశాబ్దాలుగా స్థానిక చెరువుల్లోనే భక్తులు సాంప్రదాయబద్ధంగా నిమజ్జనాలు చేస్తున్నారని, ఈ ఏడాది కూడా ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖల సమన్వయంతో హైడ్రా పరిధిలోని చెరువులతో సహా నగరంలోని అన్ని జలాశయాల్లో యథావిధిగా నిమజ్జనాలు జరిపి తీరుతామని ఉత్సవ సమితి ప్రతినిధులు ప్రకటించారు.
Also Read : ఇకపై నాయకుల కోసం కాదు : పవన్ సంచలన కామెంట్స్..!
నగరవ్యాప్తంగా ఈసారి సుమారు 1.40 లక్షల గణేష్ మండపాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో, ఈ ఆంక్షల వివాదం భక్తులలో అయోమయానికి కారణమవుతోంది. ఒకవైపు హుస్సేన్‌సాగర్‌తో పాటు స్థానిక చెరువుల పర్యావరణ పరిరక్షణ కోసం కోర్టులు, హైడ్రా వంటి సంస్థలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనాలపై పట్టుబడుతుండగా, మరోవైపు ఉత్సవాల నిర్వహణకు ఆటంకాలు కల్పించవద్దని కమిటీలు కోరుతున్నాయి. పండుగ ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ ‘హైడ్రా వర్సెస్ ఉత్సవ సమితి’ వివాదానికి ఎలాంటి పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి.

