మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయాంశాలలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ లేఖ సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి మధ్య నెలకొన్న తీవ్రమైన అంతర్గత విభేదాలను, ప్రత్యక్ష పోరును బహిర్గతం చేసింది. వైసీపీ స్థాపన నుండి జగన్‌కు అత్యంత విశ్వసనీయులుగా, కీలక నాయకులుగా వ్యవహరించిన వారిలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెరో పాత్ర పోషించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి ఒకవైపు ఢిల్లీ రాజకీయాలు, ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసే కీలక నేతగా ఉండగా.. సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కేంద్రంగా పార్టీ, మీడియా, ప్రభుత్వ వ్యవహారాల్లో బలమైన స్థానం సంపాదించుకున్నారు.
Also Read : జగన్‌ని భయపెడుతున్న ఇండియా టుడే సర్వే
2019 తర్వాత ఈ రెండు అధికార కేంద్రాల మధ్య విభేదాలు పెరిగాయనే రాజకీయ చర్చ చాలా కాలంగా ఉంది. 2024 ఎన్నికల తర్వాత ఈ విభేదాలపై చర్చ మరింత పెరిగింది. విజయసాయిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి నెల్లూరు ఎంపీగా పోటీ చేయించడం, ఆ తర్వాత ఆయన పార్టీకి క్రమంగా దూరం కావడం వెనుక సజ్జల వర్గం వ్యూహం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు విజయసాయి తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావడం, చివరకు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం ఈ పాత విభేదాలకు కొత్త ప్రాధాన్యం తెచ్చింది. అయితే, గత కొంతకాలంగా పార్టీ అంతర్గత నిర్ణయాల్లో సజ్జల ప్రాబల్యం పెరగడం, విజయసాయిరెడ్డి ప్రాధాన్యం తగ్గడంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో— ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రత్యక్షంగా ‘యుద్ధం ప్రకటన’ చేసినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

లిక్కర్ స్కామ్ విచారణలు, ఇతర పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి దూరమైన విజయసాయిరెడ్డి, ఇప్పుడు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేయడం వల్ల వారిద్దరి మధ్య రాజకీయం మరింత వేడెక్కింది.విజయసాయిరెడ్డిని కెలకొద్దు అని చెప్పినా జగన్ రెడ్డి వినడంలేదు. ఇప్పుడు గొడ్డలి పార్టీ నాయకుడు జగన్ రెడ్డి తాడేపల్లి అంతర్గత వ్యవహారాలు ఒక్కొక్కటిగా గుట్టువిప్పేస్తున్నాడు.
Also Read : వైసీపీ నేతలను జగన్ కావాలనే రెచ్చగొడుతున్నారా..?
విజయసాయి తాజాగా రాసిన బహిరంగ లేఖ వైసీపీ పరువును బజారున పడేసింది. నిన్నమొన్నటివరకూ సజ్జల-విజయసాయి మధ్య కోల్డ్ వార్ ఉందని అంతా భావించారు. కానీ ఒక ఎంపీగా ఉన్న విజయసాయిని కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేని స్థితిలో ఉన్న సజ్జల చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ సంగతి స్వయంగా విజయసాయి రెడ్డే తన బహిరంగలేఖలో చెప్పుకున్నారు. తనపై సజ్జల భౌతిక దాడి చేశారని.. జగన్ కి మొరపెట్టుకున్నా.. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని.. జగన్ ని సజ్జల ఎంతగా అదుపులో పెట్టుకున్నాడో ఇదే ఉదాహరణ అంటున్నారు విజయసాయి. నాపై వైసీపీ ‘కోటరీ’ నమ్మకద్రోహి అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని.. నేను నిజంగా నమ్మకద్రోహినే అయితే సజ్జలలా కాంగ్రెస్‍తో సంధి చేసుకుని CBI, ED చార్జ్ షీట్‍లో నాపేరు లేకుండా చేసుకునేవాడిని కదా అన్నారు విజయసాయిరెడ్డి.

జగన్‍కు నమ్మకస్తుడిననే కారణంతో జగన్‍తో పాటు ప్రతి చార్జ్ షీట్‍లో నన్ను A2గా కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిందన్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే.. నన్ను 15 నెలలు జైల్లో పెట్టారని లేఖలో పేర్కొన్నారు. నమ్మకద్రోహం నా రక్తంలో ఉంటే అప్పుడే అప్రూవర్‍గా మారేవాడిని కదా అన్నారు. 2024 ఎన్నికల తర్వాత నాకు సంబంధం లేని లిక్కర్ స్కామ్ కేసులో A5గా చేర్చారు. కాకినాడ సీ పోర్ట్ కేసులో నన్ను A2గా చేర్చారు. ఈ రెండున్నరేళ్ల కూటమి పాలనలో ‘సకల శాఖల మంత్రి’ పేరు ఏ చార్జ్ షీట్‍లోనూ లేదు. జగన్‌కు వెన్నుపోటు పొడుస్తూ ఏ కేసులూ లేకుండా చేసుకోవడం ‘కోటరీ’ నాయకుడికి తెలిసినంత నాకు తెలియదంటూ ఎద్దేవా చేశారు. నేను ఏనాడూ నమ్మకద్రోహం పనులు చేయలేదని.. ఈ ‘కోటరీ’ నాయకుడే జగన్‍కు నాపై చాడీలు, అబద్ధాలు చెప్పి నన్ను ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారని విజయసాయి ఓపెన్ అయిపోయారు.
Also Read : 300 కోట్ల పెట్టుబడి.. లోకేష్ ట్వీట్ తో స్టేట్ మారిందా..?
జగన్ మెప్పు పొందడానికి నాస్తికుడు, కమ్యూనిస్టుగా చెప్పుకునే ఇతను వైసీపీకే కాదు.. రాష్ట్రానికే నమ్మకద్రోహి అంటూ లేఖలో ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి నన్ను పొమ్మనలేక పొగ పెట్టింది ఎవరు? 2019 ఎన్నికల తర్వాత సజ్జల ప్రమేయం శృతిమించిందన్నారు. ఆనాడు రాజ్యాంగేతర శక్తిగా సజ్జల వ్యవహరించారని.. జగన్‌ను ఎవరినీ కలవనీయకుండా అడ్డుగోడ కట్టింది సజ్జల కాదా? అని విజయసాయి ప్రశ్నించారు. జగన్‌కు కుటుంబ సభ్యులు దూరమైంది సజ్జల వల్ల కాదా? నా ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో పనిచేయలేక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు విజయసాయిరెడ్డి.
‘కోటరీ’ వల్ల అవమానాలు భరించలేకే పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు. కోవర్టు రాజకీయం నాకు చేతకాదు.. ‘కోటరీ’ నాయకుడి చేతిలో జగన్ బందీ అయ్యారంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన బహిరంగ లేఖ వైసీపీలో ప్రకంపనలు కలిగిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీలో “నెంబర్ వన్” నాయకుడిగా అభివర్ణిస్తూ, జగన్ పాత్రను ఎద్దేవా చేసే రీతిలో వ్యాఖ్యలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీకి మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రానికే నమ్మకద్రోహి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. సజ్జలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీని ఆత్మరక్షణలో పడేశాయి. విజయసాయి లేఖపై సజ్జల ఎలా స్పందిస్తారో చూడాలి.
-జి.సత్యనారాయణరాజు

