అమెరికాలో ఉద్యోగం చేయాలనే విదేశీ నిపుణుల కలలపై, ముఖ్యంగా భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లపై ట్రంప్ ప్రభుత్వం మరోసారి కోలుకోలేని దెబ్బకొట్టింది. అమెరికాలో అత్యంత డిమాండ్ ఉన్న హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా 103,265 డాలర్లకు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.99 లక్షల నుండి రూ.1 కోటి పెంచుతూ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ సరికొత్త నిబంధనలను ప్రతిపాదించింది. గతంలో కేవలం 2,000 నుండి 5,000 డాలర్ల లోపు మాత్రమే ఉన్న ఈ ఫీజును ఒకేసారి ఇంత భారీగా పెంచడం అంతర్జాతీయ టెక్ రంగంలో పెను సంచలనంగా మారింది.
Also Read : చైనాలో ఆ రాత్రి ఇంత ఘోరం జరిగిందా..?2 లక్షల మంది ఎలా..?
ఈ తాజా ప్రతిపాదన ప్రకారం.. అమెరికా కంపెనీలు విదేశాల నుండి నిపుణులను కొత్తగా రిక్రూట్ చేసుకోవాలంటే వార్షిక కోటా కింద సమర్పించే ప్రతి కొత్త హెచ్-1బీ పిటిషన్‌కు ఈ భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల అమెరికా కంపెనీలకు విదేశీ ప్రతిభను ఆహ్వానించడం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. అయితే, ఈ ప్రతిపాదన కేవలం కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే అమెరికాలో ఉంటూ వీసా పొడిగింపు లేదా కంపెనీ మార్పు కోసం చూస్తున్న వారికి దీని నుండి మినహాయింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
Also Read : 300 కోట్ల పెట్టుబడి.. లోకేష్ ట్వీట్ తో స్టేట్ మారిందా..?
ఈ కఠినమైన నిర్ణయం వెనుక హెచ్-1బీ వీసా వ్యవస్థను క్రమంగా నిర్వీర్యం చేయాలనే ట్రంప్ ప్రభుత్వ అంతర్గత వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. “అమెరికన్ సంస్థలకు ఉద్యోగులు కావాలంటే స్థానిక అమెరికన్లకే శిక్షణ ఇచ్చి రిక్రూట్ చేసుకోవాలి” అనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యూఎస్ వర్గాలు సమర్థిస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం 30 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉందని, దీనిపై ఐటీ దిగ్గజాలు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ, ఇది అమల్లోకి వస్తే మాత్రం భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులపై అత్యంత తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది.

