వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో అల్లాడుతున్న అంతర్గత వివాదాలు ఇప్పుడు రోడ్డుకెక్కాయి. విజయవాడ వేదికగా జోగి రమేష్ కోడలు మేఘన ఏర్పాటు చేసిన మీడియా సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తనపై నిన్న మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, తన అత్తగారింట్లో అనుభవించిన నరకాన్ని, ఎదుర్కొన్న వేధింపులను మీడియా ముందు కుండబద్దలు కొట్టారు. తనకు జరిగిన అన్యాయానికి సంబంధించిన అన్ని పక్కా ఆధారాలను ఇప్పటికే పోలీసులకు అందజేసినట్లు మేఘన వెల్లడించారు.
Also Read : నెల్లూరు రూరల్‌లో ఎమ్మెల్యే సరికొత్త పొలిటికల్ క్యాంపెయిన్..!
ఈ ప్రెస్ మీట్లో మేఘన మాట్లాడుతూ.. పెళ్లికి ముందు జోగి రమేష్ కుటుంబం తాము హిందువులమని చెప్పి మోసం చేశారని సంచలన నిజాన్ని బయటపెట్టారు. పెళ్లయిన తర్వాతే వారు క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారనే అసలు విషయం తనకు తెలిసిందని, వారి ఇంట్లో కనీసం పూజ గది కూడా లేదని పేర్కొన్నారు. ప్రతీ ఆడపిల్లలాగే ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన తనకు మొదటి నుంచే మోసం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. తన భర్త రాజీవ్‌కు ఉన్న కొన్ని వ్యక్తిగత సమస్యలు ముందే తెలిసి కూడా, జోగి రమేష్ కుటుంబం ఆ విషయాలను దాచిపెట్టి తనకు బలవంతంగా పెళ్లి చేసి జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు.
Also Read : నన్ను వేధించోద్దు ప్లీజ్.. అంబటి సంచలన కామెంట్స్..!
భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను పెద్దమనుషులుగా పరిష్కరించాల్సిన మాజీ మంత్రి జోగి రమేష్ దంపతులు.. ఆ పని చేయకుండా లేనిపోని వివాదాలు సృష్టించారని మేఘన మండిపడ్డారు. “నువ్వు పుట్టింటి నుండి అదనపు కట్నం తెస్తేనే ఇక్కడ సంతోషంగా ఉంటావు” అంటూ తన అత్తగారు నేరుగా వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జోగి రమేష్‌కు కూడా ఒక కుమార్తె ఉందని గుర్తు చేసిన మేఘన.. రేపు ఆమెకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే జోగి రమేష్ ఊరుకుంటారా అని నిలదీశారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతానని చెప్తూ.. సమాజంలో అన్యాయానికి గురవుతున్న ఆడపిల్లలు ఎవరూ ఇంట్లో కూర్చుని కుమిలిపోవద్దని, ధైర్యంగా బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడాలని మేఘన పిలుపునిచ్చారు.

