మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పుష్కర కాలం పాటు ఏక చత్రాధిపతిగా ఢిల్లీ గడ్డను ఏలుతున్న ప్రధాని మోదీకి సోషల్ మీడియా వేదికగా వరుస షాకులు తగులుతున్నాయి. నిన్నటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ప్రధాని సహా కేంద్ర పెద్దలను ఇరుకున పెట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన కాక్రోచ్ అనే వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న యువత.. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ యుద్ధం చేసింది. అది కాస్తా చివరికి కేంద్ర విద్య శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వెళ్లింది.
Also Read : భారత ధనికులు విదేశాల్లోనే సెటిల్ అవుతారా..?
తాజాగా మరో సోషల్ మీడియా యుద్ధం మొదలైంది. అదే “దిమాగీ నక్సల్స్”. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై జెండా వందనం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ తర్వాత చేసిన ప్రసంగంలో “దిమాగీ నక్సల్స్” అంటూ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో అదే పదాలతో కొత్త రాజకీయ వ్యంగ్య ఖాతా తెరపైకి వచ్చింది. ఖాతా ప్రారంభించిన గంటల వ్యవధిలోనే లక్షల్లో ఫాలోవర్స్ చేరడం చూస్తుంటే.. ఇది మరో సోషల్ మీడియా వార్‌కు దారి తీసేలా ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. “దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ” పేరుతో ప్రారంభమైన ఈ ఖాతా.. మోదీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా పోస్టులతో దూసుకువెళ్తోంది. తాము భగత్‌సింగ్ వారసులమంటూ నిర్వాహకులు ఇప్పటికే ఓ ప్రకటన చేశారు.
ఖాతా ప్రారంభమైన కొద్దిసేపటికే భారీగా స్పందన వచ్చింది. ఒక్క రోజులోనే 16 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరారు. దీంతో ఈ ఖాతా వెనుక ఎవరున్నారు..? అన్న చర్చ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధాని కేర్స్ ఫండ్ నుంచి తమకు నిధులు వస్తున్నాయంటూ ఖాతాలో పోస్టులున్నాయి. ఆ నిధులపై ఆడిట్ చేయించుకోవచ్చంటూ కేంద్ర పెద్దలతో పాటు విమర్శలు చేస్తున్న వారికి కూడా సవాల్ చేసే తరహాలో పోస్టులు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రివాల్, అఖిలేష్ యాదవ్, ప్రకాశ్ రాజ్ తదితరుల ఖాతాలను ఈ కొత్త ఖాతా ఫాలో అవుతోంది. మోదీ వ్యాఖ్యల తర్వాతే ఈ ఖాతా తెరపైకి రావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఖాతా వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఏ సంస్థకు సంబంధించింది? అన్నది మాత్రం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
Also Read : APPSC గ్రూప్-1 అక్రమాలు.. డిఫెన్స్‌లో జగన్ పార్టీ
ఇదే సమయంలో మోదీ చేసిన “దిమాగీ నక్సల్స్” వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం ఆ వ్యాఖ్యలు ప్రతిపక్షాలనుద్దేశించి చేసినవి కావని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా.. మోదీ “దిమాగీ నక్సల్స్” వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే అదే పదాలతో సోషల్ మీడియా ఖాతా వైరల్ కావడం.. రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మరి ఈ సోషల్ మీడియా వార్.. ఎవరి రాజీనామాలను డిమాండ్ చేస్తుందో చూడాలి.

