ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది ఆక్రమణలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి తుళ్లూరు మండలం, బోరుపాలెం పరిసర ప్రాంతాల్లో కరకట్ట వెంట ఏకంగా జీవనది అయిన కృష్ణానదిని పూడ్చివేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నది ఒడ్డును మట్టితో భర్తీ చేస్తూ క్రమంగా దానిని వ్యవసాయ భూమిగా మారుస్తున్న ఈ నయా భూదందా రాజధాని ప్రాంతంలో కలకలం రేపుతోంది. నది పరివాహక ప్రాంతాన్ని కాపాడాల్సిన కొందరు స్థానిక అధికారుల అండదండలతోనే ఈ దారుణం జరుగుతోందని గ్రామస్థులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
Also Read : అమరావతికి బిగ్ బూస్ట్.. సీఆర్డీఏ సంచలన నిర్ణయం..!
ఇలా నదిలో అక్రమంగా పూడ్చి, ఆక్రమించుకున్న భూములను రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి చేర్చేందుకు ఒక పెద్ద కుట్ర జరుగుతోందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వం నుండి భారీగా ప్రయోజనాలు, పరిహారాలు పొందేందుకు కొందరు భూమాఫియా నేతలు స్కెచ్ వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సహజసిద్ధమైన నది స్వరూపాన్ని మార్చేస్తూ, భవిష్యత్తులో వరద ముప్పు పెరిగేలా చేస్తున్న ఈ అక్రమాలపై స్థానిక రైతులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..? పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్..!
ఈ నేపథ్యంలో కృష్ణానది పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రజా సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, నీటిపారుదల మరియు సీఆర్డీఏ అధికారులు సంయుక్తంగా అత్యవసర సర్వే నిర్వహించి, నది సరిహద్దులను ఖరారు చేయాలని కోరుతున్నారు. నదిని ఆక్రమించి పూడ్చివేతలకు పాల్పడుతున్న భూ బకాసురులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఈ దందాలో భాగస్వాములైన అధికారులను తక్షణమే విచారించాలని అమరావతి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

