కేంద్రంలో బీజేపీకి ఇప్పుడు రెండు బిల్లులే శ్రీరామ రక్షగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో ఒకటి డీ లిమిటేషన్ బిల్లు అయితే మరొకటి మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ రెండు బిల్లులను పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ ద్వారా నెగ్గించుకుని చట్టంగా తీసుకుని వస్తే కనుక బీజేపీకి 2029 ఎన్నికల్లో ఆశలు సజీవంగా ఉంటాయని కమలనాధులు నమ్ముతున్నారు. అందుకే బీజేపీకి ఈ బిల్లులు ఎంతో కీలకం మాత్రమే కాదు ప్రాణ సమానం కూడా అని అంటున్నారు. ఈ బిల్లుల ఆమోదం కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు. అలాగే మద్దతు కూడగట్టడం కోసం ఎన్ని వ్యూహాలు పన్నాలో అన్నీ పన్నుతోంది.
Also Read : ఎవరీ సారాంశ్ జైన్..? 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ..!
వర్షాకాల సమావేశాలే కీలకం.. ఇక ఈ బిల్లుల ఆమోదానికి సరైన సమయం వర్షాకాల సమావేశాలు అని బీజేపీ భావిస్తోంది. అందుకే ఆగస్టు 13 దాకా నిర్వహించే ఈ సమావేశాల్లోనే బిల్లులను ఆమోద ముద్ర వేయించుకుంటే 2029 నాటికి కావాల్సినంత సమయం ఉంటుందని అప్పుడు ఈ బిల్లులు చట్టంగా మారితే ఎంతగానో ఉపయోగం జరుగుతుందని భావిస్తోంది. ఇపుడు కాకపోతే మళ్ళీ నవంబర్, డిసెంబర్‌లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లులు తేవాల్సి ఉంటుంది. అదే కనుక జరిగితే 2027 వచ్చేస్తుంది. అప్పటికి ఎన్నికలు గట్టిగా రెండేళ్లు ఉంటాయి. దాంతో ఈ బిల్లులు చట్టం అయినా అమలు చేయడానికి అవసరం అయిన సమయం ఉండదని బీజేపీ బెంగపడుతోందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. డీలిమిటేషన్ బిల్లు కనుక ఆమోదం పొందితే ఆ సంఖ్య అమాంతం 850 దాకా పెరుగుతుంది. అంటే మరో 300 ఎంపీలు అన్న మాట. వీరంతా ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తారు. అదే బీజేపీకి అడ్వాంటేజ్ కానుందని అంటున్నారు. అదే విధంగా చూస్తే కనుక ప్రత్యర్థుల బలమైన లోక్‌సభ నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణలో రెండుగా చీలిపోతాయని.. అది అధికారంలో ఉన్న బీజేపీ లాంటి పార్టీలకే అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. అదే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక ఆమోదం పొందితే 33 శాతం సీట్లు మహిళల వశం అవుతాయి. అంతే ప్రతిపాదిత 850 ఎంపీ సీట్లలో 280 వరకు వారికే దక్కుతాయని అంటున్నారు.
Also Read : వారంలో ఒక కిలో బరువు తగ్గాలా..? రోజుకు ఎన్ని అడుగులు నడవాలి..?
ఇక్కడ కూడా బలమైన ప్రత్యర్థులను గురి చూసి మరీ ఆయా నియోజకవర్గాలను మహిళా రిజర్వేషన్లుగా మార్చేసే ప్రక్రియ కూడా రాజకీయ వ్యూహంలో భాగంగా జరగవచ్చు అని ప్రచారం సాగుతోంది. అందుకే ఈ రెండు బిల్లులు బీజేపీకి ఆయువు పట్టుగా ఉన్నాయి. ఆ సంగతి తెలిసే విపక్షాలు కూడా ఈ బిల్లులు పార్లమెంట్ అనుమతి పొందకుండా చూస్తున్నాయి. పార్లమెంట్‌లో ప్రతిరోజూ రభస సాగుతోంది. గందరగోళం కూడా నెలకొంటోంది. అసలు చర్చలు సాగడం లేదు. దాంతో ఈ వర్షాకాల సమావేశాలు వానార్పణంగా చేస్తే ఇక ఈ బిల్లులు తిరిగి శీతాకాల సమావేశాల దాకా పార్లమెంట్ ముందుకు రావని విపక్షం భావిస్తోంది. అప్పటికి తగిన వ్యూహంతో సిద్ధం అయితే 2029 ఎన్నికలలో డీ లిమిటేషన్ అన్న ప్రసక్తి ఉండదని విపక్షం కొత్త ఆలోచనలు చేస్తోంది.

