ఆంధ్రప్రదేశ్ విద్యారంగంపై మంత్రి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన చేపట్టిన సంచలనాత్మక సంస్కరణలు ఇప్పుడు కొత్త చరిత్రను తిరగరాస్తున్నాయి. నిన్నటివరకు ప్రభుత్వ బడులంటే అనాసక్తి చూపిన తల్లిదండ్రులు, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లను విడిచిపెట్టి మరీ సర్కారీ బడుల బాట పడుతున్నారు. గత రెండేళ్ల కాలంలోనే ఏకంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు మారడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ బడుల ముందు నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయంటే లోకేష్ తీసుకొచ్చిన విజన్ ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : కోడలిపై జోగి రమేష్ కుటుంబం గృహహింస
రంపచోడవరం పరిధిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్, విద్యావ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలోని నిడమర్రు పాఠశాలను కార్పొరేట్ సంస్థలకు తీసిపోని రీతిలో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దామని, ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ అదే తరహాలో లీప్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. నిడమర్రు స్కూల్లో తన బిడ్డకు సీటు ఇప్పించాలంటూ ఓ తల్లి గొడవపడిన సంఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.
గతంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సమస్యలతో సతమతమైన వ్యవస్థకు స్వస్తి పలుకుతూ లోకేష్ వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే 10 వేల పాఠశాలల్లో తరగతికో టీచర్‌ను కేటాయించారు. అంతేకాకుండా రికార్డు స్థాయిలో మెగా డీఎస్సీ ద్వారా 16 వేల పోస్టులను భర్తీ చేయడమే కాక, ఈ ఏడాదిలోనే మరో 3 వేల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపారు. ఇక గిరిజన ప్రాంతాల్లో సొంత భవనాలు లేని 200 ప్రభుత్వ పాఠశాలలకు ఏడాది వ్యవధిలోనే శాశ్వత భవనాలు నిర్మించి ఇస్తానని ఆయన ఘంటాపథంగా భరోసా ఇచ్చారు.
విద్యార్థులకు ఆధునిక విద్యను అందించే క్రమంలో తొమ్మిదో తరగతి పిల్లల కోసం క్లిక్కర్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థి ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడో ఆ వివరాలు, సంబంధిత వీడియో పాఠాలు నేరుగా తల్లిదండ్రుల ఫోన్లకే వచ్చేలా డిజైన్ చేశారు. దీనివల్ల పిల్లలు ఇంటికి వచ్చాక కూడా చదువుపై శ్రద్ధ పెట్టేలా పక్కా ప్లాన్ అమలు చేస్తున్నారు. తల్లికి వందనం అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, మనకు జన్మనిచ్చిన తల్లికి, భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు కృతజ్ఞత చెప్పడమని లోకేష్ వ్యాఖ్యానించారు.
Also Read : కాక్రోచ్ డిమాండ్.. అంతటితో ఆగుతుందా..?
గతంలో పేపర్లు, టీవీల్లో కేవలం ప్రైవేటు స్కూళ్ల పిల్లల ఫొటోలు, ర్యాంకులే కనిపించేవని, కానీ తమ సంస్కరణల వల్ల పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారని లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. అలా సాధించిన సర్కారీ పిల్లల ఫొటోలను ప్రభుత్వ ఖర్చుతోనే పత్రికల్లో భారీ ప్రకటనలుగా వేయించడం తనకు ఎంతో గర్వాన్ని, కిక్‌ను ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ మెగా పీటీఎమ్‌కు ఏకంగా 71 లక్షల మంది హాజరై సరికొత్త రికార్డు సృష్టించారు. మొత్తానికి నారా లోకేష్ తన విజన్‌తో ఏపీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేస్తూ పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు.

