అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పరస్పరం యుద్ధ హెచ్చరికలు జారీ చేసుకుంటుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అమెరికాను ఉద్దేశించి ఇరాన్ సరికొత్త, అత్యంత ఘాటు హెచ్చరికలు చేసింది. ప్రస్తుత ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి యుద్ధం గనుక తీవ్రరూపం దాల్చితే, అమెరికాలో ‘9/11’ (సెప్టెంబర్ 11 దాడులు) తరహా భీకర దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read : దిగి వచ్చిన మోడీ.. కీలక ప్రకటన..
ఇరాన్ ప్రభుత్వ అధికారిక అనుబంధ వార్తాసంస్థ తస్నిమ్ నివేదికల ప్రకారం.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికాను హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. “ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే, అమెరికాలో జాతీయ సంతాప దినాలు ప్రకటించాల్సిన పరిస్థితిని తెచ్చేలా మా ఆపరేషన్లు ఉంటాయి” అని ఇరాన్ స్పష్టం చేసింది. గతంలో 9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా అధికారికంగా జాతీయ సంతాప దినాలను ప్రకటించగా, మళ్లీ అటువంటి రోజూ వస్తుందంటూ ఇరాన్ పరోక్షంగా హెచ్చరించింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి లో ఇరాన్ గనుక వాణిజ్య నౌకలపై మళ్లీ దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ దాడులు చేసే ప్రతి నౌకకు బదులుగా.. ఆ దేశంలోని ప్రధాన వంతెనలను, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని బాంబులతో కూల్చివేస్తామని, ఇందులో ఇరాన్ రాజధాని టెహ్రాన్ కూడా మినహాయింపు కాదని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తేల్చి చెప్పారు.
Also Read : ఆ జిల్లాలో వైసీపీ ఇక కష్టమే..!
ట్రంప్ ఇచ్చిన ఈ మౌలిక వసతుల ధ్వంసం హెచ్చరికకు ఇరాన్ రాజధాని టెహ్రాన్ కూడా అదే స్థాయిలో బదులిచ్చింది. అమెరికా గనుక తమ దేశంలోని ఏ ఒక్క వంతెన లేదా పవర్ ప్లాంట్‌ను తాకినా, ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా ప్రయోజనాలు, సైనిక స్థావరాలు ఉన్న దేశాల మౌలిక సదుపాయాలపై అంతకు కొన్ని రెట్లు తీవ్రమైన దాడులు చేస్తామని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరించాయి. అంతేకాకుండా, హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు భద్రతపై స్పందిస్తూ.. ఇరాన్ ప్రభుత్వం జారీ చేసిన సూచనలు మరియు నిబంధనలను ఖచ్చితంగా పాటించే నౌకలకు మాత్రమే సురక్షిత ప్రయాణాన్ని అనుమతిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.

