ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలు కానుంది. ముందుగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ తర్వాతే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలని భావిస్తోంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ముందస్తు కసరత్తును ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. అలాగే అసంపూర్తిగా నిలిచిపోయిన డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియను సమీక్షిస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక వచ్చే లోగా ముందస్తు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Also Read : టీటీడీ కీలక సమాచారం లీక్..? అసలేం జరిగింది..?
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ముగిసిన వెంటనే సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 123 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు ఉన్నాయి. కోర్టు కేసుల కారణంగా 2021లో కేవలం వంద చోట్లే రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 23 పుర, నగరపాలక సంస్థల్లో సమీపంలోని 112 గ్రామ పంచాయతీలను విలీనం చేయడంపై అప్పట్లో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కేసుల పెండింగ్ కారణంగా ఆ 23 చోట్ల ఎన్నికలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ కేసుల పరిష్కారంపై అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయ నిపుణులతో అధికారులు విస్తృతంగా చర్చిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు 2022లో కాకినాడ నగరపాలక సంస్థలో రెండు డివిజన్లు మినహాయించి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 87 చోట్ల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది మార్చి 17వ తేదీతోనే ముగిసింది. మరో 13 చోట్ల నవంబరులో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎన్నిక కేవలం 100 చోట్ల మాత్రమే నిర్వహించాలా? లేక మొత్తం 123 చోట్లా నిర్వహణకు ముందుకెళ్లాలా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని పురపాలక శాఖను కోరింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన చివరి దశకు చేరుకుని నిలిచిపోయింది.
Also Read : ఎస్సీలంటే అంత కోపం ఎందుకు జగన్..?
జనాభా ఆధారంగా వీటి సంఖ్యను 3,916 నుంచి 4,843కి పెంచాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విశాఖపట్నం, మచిలీపట్నంలో వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, పునర్విభజనపై స్టే ఇచ్చి కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ తర్వాత ఇదే అంశంపై మరికొన్ని కేసులు రావడంతో వార్డుల పెంపు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. వచ్చే రెండు, మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలంటే ప్రభుత్వం ముందు ప్రధానంగా రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పునర్విభజన ప్రక్రియను పక్కన పెట్టి పాత డివిజన్లు, వార్డులతోనే ఎన్నికలకు వెళ్లాలి. లేదంటే హైకోర్టులో కేసులు పరిష్కారమయ్యే వరకు వేచి చూడాలి. ఈ విషయాన్ని అధికారులు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఓ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి అధికారులకు ప్రభుత్వం తుది స్పష్టత ఇవ్వనుంది.

