నేటి తరం హీరోయిన్లలో నటన, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునే అరుదైన నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్లోనూ ఆమెకు విశేషమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా గ్లామర్ కంటే కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలను ఎంపిక చేసుకోవడం ఆమె ప్రత్యేకతగా చెప్పవచ్చు. తన కెరీర్ ప్రారంభం నుంచే సాయి పల్లవి రొమాంటిక్ సన్నివేశాల విషయంలో కొన్ని వ్యక్తిగత పరిమితులను పాటిస్తూ వస్తున్నారు. కథ, పాత్ర అవసరం ఉన్నప్పుడే కొన్ని సన్నివేశాలకు అంగీకరిస్తానని, అవసరం లేని సందర్భాల్లో మాత్రం అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉంటానని ఆమె పలుమార్లు వెల్లడించారు.
Also Read : ఫౌజీ సెట్ లో అసలేం జరిగింది..?
ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే అంశంపై మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటర్వ్యూలో యాంకర్, “దర్శకులు మీతో ముద్దు సన్నివేశాలు చిత్రీకరించేందుకు పెద్దగా ప్రయత్నించరని వినిపిస్తోంది. ఇది నిజమేనా?” అని ప్రశ్నించగా, సాయి పల్లవి స్పందిస్తూ, “అవును. నేను అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడనని వారికి తెలుసు. అందుకే అలాంటి ప్రతిపాదనలు పెద్దగా రావు” అని తెలిపారు.
అనంతరం, “ఇండస్ట్రీలోకి రాకముందే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా?” అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, “నాకు వ్యక్తిగతంగా అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదు. నాకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నారు. ఆయన పట్ల గౌరవంతో కూడా నేను అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉంటాను. ప్రతి ఒక్కరూ జీవితంలో ఇల్లు, కారు, ప్రశాంతమైన జీవితం కోరుకుంటారు. నాకు ప్రస్తుతం అవన్నీ ఉన్నాయి. అలాంటి సన్నివేశాల్లో నటించి వాటిని సంపాదించుకోవాల్సిన అవసరం నాకు అనిపించదు. ప్రస్తుతం ఉన్న జీవితంతోనే నేను సంతృప్తిగా ఉన్నాను” అని పేర్కొన్నారు.
Also Read : ముందు రావణ్.. తర్వాత ఆయనే..!
ఇదిలా ఉండగా, ఇటీవల విడుదలైన ‘టాక్సిక్’ సినిమా తొలి పాటలో హీరోయిన్ కియారా అద్వానీ, హీరో యష్‌తో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించారు. ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియా వినియోగదారులు సాయి పల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావిస్తూ వివిధ రకాలుగా పోలికలు తీసుకొస్తున్నారు. అయితే, సాయి పల్లవి తన వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే వ్యక్తం చేశారని, వాటిని మరో నటిపై వ్యాఖ్యలుగా లేదా పరోక్ష విమర్శలుగా భావించేలా ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి సాయి పల్లవి వ్యాఖ్యలను కియారా అద్వానీతో నేరుగా ముడిపెట్టడం కేవలం సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలుగా మాత్రమే చూడాలి.

