ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ మేధో సంస్థ ‘లోవీ ఇన్స్టిట్యూట్’ తాజాగా విడుదల చేసిన 2026 ‘ఆసియా పవర్ ఇండెక్స్’ నివేదికలో భారతదేశం తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 27 దేశాల శక్తి సామర్థ్యాలను విశ్లేషించి రూపొందించిన ఈ జాబితాలో, భారత్ 40.5 పాయింట్లతో ఆసియాలో మూడో అతిపెద్ద శక్తిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా, చైనా తర్వాతి స్థానంలో నిలిచిన భారత్, గత ఏడాది కంటే తన స్కోరును 0.5 పాయింట్లు మెరుగుపరుచుకుంది.
Also Read: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు డూ ఆర్ డై..!
అత్యంత విశేషమేమిటంటే, 2018లో ఈ సూచీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు చైనాతో ఉన్న శక్తి అంతరాన్ని భారత్ రికార్డు స్థాయిలో అత్యల్ప స్థాయికి తగ్గించగలిగింది. ఈ నివేదికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రాంతీయ నాయకత్వ ర్యాంకింగ్స్లో ప్రధాని మోదీ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి, 5వ స్థానం నుంచి 2వ స్థానానికి చేరుకున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తర్వాతి స్థానంలో నిలిచిన మోదీ, ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాల అధినేతలలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా నిలిచారు.
Also Read: భూమన ఫేక్ ప్రచారానికి ఆధారాలతో దిమ్మతిరిగే కౌంటర్..!
ఆసియా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న స్థిరమైన వాణిజ్య సంబంధాలు, దౌత్యపరమైన చొరవలే మోదీ ర్యాంకు మెరుగుపడటానికి ప్రధాన కారణాలని లోవీ ఇన్స్టిట్యూట్ విశ్లేషించింది. కేవలం ఆర్థిక, సైనిక అంశాలే కాకుండా దౌత్య ప్రభావం, సాంస్కృతిక బలం, భవిష్యత్తు వనరుల విభాగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతిని కనబరిచింది. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలకు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయాలు, పెరుగుతున్న రక్షణ భాగస్వామ్యాల వల్ల డిఫెన్స్ నెట్వర్క్స్ విభాగంలో భారత్ ర్యాంకింగ్ మరింత మెరుగుపడింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రభావం తగ్గుతున్న తరుణంలో, భారత్ మాత్రం 40 పాయింట్ల మార్కును దాటి మేజర్ పవర్ కేటగిరీలో జపాన్, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల కంటే ముందుండటం విశేషం.


