ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరి కేంద్రంగా ఏర్పాటు చేసిన ‘ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ డైరెక్టరేట్’ ఇప్పుడు పరిపాలనా వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. దేశంలో ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘రోడ్ సేఫ్టీ అథారిటీ’లు పనిచేస్తున్నాయి. కానీ రవాణా శాఖకు భిన్నంగా, నేరుగా రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ పర్యవేక్షణలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఒక ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. సాధారణంగా పోలీసు శాఖలో శాంతిభద్రతల విధులకు ఉండే ప్రాధాన్యత ట్రాఫిక్ విభాగానికి ఉండదనే భావన ఉంది.
Also Read : ప్రతిరోజూ ఓట్స్ తింటే శరీరంలో ఏం జరుగుతుంది..?
ఆ సంప్రదాయ పద్ధతికి స్వస్తి పలుకుతూ, ట్రాఫిక్ నిర్వహణను ఒక ప్రత్యేక శాస్త్రీయ విభాగంగా మార్చేందుకు ఏపీ సర్కార్ వేసిన ఈ అడుగు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు జాతీయ రహదారులు, ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు స్థానిక పోలీసు సిబ్బందిపైనే ఆధారపడాల్సి వచ్చేది. దీనికి తోడు రవాణా శాఖ, రోడ్లు-భవనాల శాఖ, నేషనల్ హైవే అథారిటీ మధ్య సమన్వయ లోపం వల్ల ప్రమాదాల నివారణ చర్యలు ఆశించిన వేగంతో జరిగేవి కావు. కొత్తగా ఏర్పాటైన ఈ డైరెక్టరేట్ వల్ల ఆ లోటు భర్తీ కానుంది. కేవలం జరిమానాలు విధించడానికే పరిమితం కాకుండా, ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి, రోడ్డు ఇంజినీరింగ్ లోపాలు ఎక్కడున్నాయి అనే అంశాలపై డేటా ఆధారిత విశ్లేషణ జరిపేందుకు ఒక ప్రత్యేక యంత్రాంగం అందుబాటులోకి రానుంది.
Also Read : ఆస్ట్రేలియా మరో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్..బయటపడ్డ సంచలన నిజాలు..!
పైగా, ప్రభుత్వ ఖజానాపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకుండా ఉన్న సిబ్బందినే సమర్థవంతంగా పునర్వ్యవస్థీకరించడం ఇందులో మరో కీలక విశేషం. అయితే, కాగితాలపై అద్భుతంగా కనిపిస్తున్న ఈ నూతన వ్యవస్థ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే కొన్ని కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉండే సాధారణ పోలీస్ స్టేషన్ల సిబ్బందికి, ఈ ప్రత్యేక డైరెక్టరేట్ అధికారులకు మధ్య అధికారాల విషయంలో స్పష్టత ఉండాలి. రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లగలిగితేనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. మొత్తానికి, పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నిర్వహణలో ఏపీ తీసుకొచ్చిన ఈ ‘డైరెక్టరేట్ మోడల్’ విజయవంతమైతే, రాబోయే రోజుల్లో మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


