రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకే అందించే లక్ష్యంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం సరికొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రేషన్ షాపుల ద్వారానే ఈ సేవలను విస్తరిస్తూ తీసుకొచ్చిన విలేజ్ మార్ట్ పైలట్ ప్రాజెక్ట్‌ను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని లాల్ పురంలో ఈ మినీ మార్ట్ మొదటి కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించి, తొలి విక్రయాలను పరిశీలించారు.
Also Read : సీఐ నాగరాజును వెంటాడుతున్న పాపాలు.. మరో సంచలన కేసు..!
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కేవలం ఒకటో రెండో వస్తువుల పంపిణీకే రేషన్ షాపులను పరిమితం చేసి, డీలర్ల ఉపాధిని దెబ్బతీశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ షాపులకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు, వాటిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ విలేజ్ మార్ట్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు.
Also Read : మాట నిలబెట్టుకున్న కూటమి సర్కార్.. రైతులకు గుడ్ న్యూస్..!
లాల్‌పురంలో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడం ఆధారంగా ఈ పథకాన్ని రాష్ట్రమంతటా విస్తరిస్తామని మంత్రి ప్రకటించారు. మొదటి విడతగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విడతల వారీగా 1,000 మినీ మార్ట్ లను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటి చెంతనే సరుకులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ విలేజ్ మార్ట్ ల ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ లభించే నిత్యావసర వస్తువుల ధరలు బహిరంగ మార్కెట్ రేట్ల కంటే రూ.3 నుండి రూ.4 వరకు తక్కువగా ఉంటాయి. కేవలం నాణ్యమైన నిత్యావసర సరుకులు మాత్రమే కాకుండా, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల మిల్లెట్స్ కూడా ఈ మార్ట్ ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

