అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అక్కడి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. దేశం నుంచి బహిష్కరించే నిబంధనలను మరింత సులభతరం చేస్తూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కొత్త రూల్ ప్రకారం, ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ ఏదైనా నేరానికి పాల్పడ్డారనే బలమైన అనుమానం ఉంటే, కోర్టులో ఇంకా నేరం నిరూపణ కాకపోయినా సరే, వారు విదేశీ పర్యటనల నుంచి తిరిగి వచ్చేటప్పుడు బోర్డర్ అధికారులు అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించవచ్చు. ముక్ చోయ్ లావ్ అనే చైనా పౌరుడి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
Also Read : ఉక్రెయిన్ కు భారత సైన్యం..? వైట్ హౌస్ సీక్రెట్స్ లీక్..!
గ్రీన్ కార్డ్ హోల్డర్లను దేశంలోకి రానివ్వకుండా ఆపడానికి బోర్డర్ అధికారి వద్ద స్పష్టమైన, తిరుగులేని ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేవలం ప్రాథమిక ఆధారాలు లేదా అనుమానం ఉంటే చాలు, వారిని తిరిగి సాధారణ నివాసిగా అనుమతించకుండా కొత్తగా ప్రవేశం కోరే వ్యక్తిగా పరిగణించవచ్చని జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం కోర్టులో నేరం రుజువైతేనే కఠిన చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు అమల్లోకి వచ్చిన కొత్త వివరణ ప్రకారం బోర్డర్ అధికారులకు విస్తృత అధికారాలు లభించాయి.
Also Read : లోకేష్ సంచలన ప్రకటన.. దేశంలోనే తొలి రాష్ట్రం..!
వారు గ్రీన్ కార్డ్ ఉన్నప్పటికీ వెంటనే దేశంలోకి ఎంట్రీని నిరాకరించవచ్చు. అలాగే సదరు వ్యక్తిని తాత్కాలిక అనుమతిపై ఉంచవచ్చు లేదా అవసరమైతే నిర్బంధించవచ్చు. వీటన్నింటికీ మించి కోర్టులో నేరం పూర్తిగా నిరూపణ కాకముందే దేశం నుంచి పంపించే డిపోర్టేషన్ ప్రక్రియను ప్రారంభించే వీలుంటుంది. అమెరికాలో పెద్ద సంఖ్యలో భారతీయ మూలాలున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లు నివసిస్తున్నారు. ఈ తీర్పు వల్ల పెండింగ్ క్రిమినల్ కేసులు లేదా విచారణలు ఎదుర్కొంటున్న భారతీయులు భారతదేశానికి లేదా ఇతర దేశాలకు ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వారు తిరిగి అమెరికా వచ్చేటప్పుడు ఎయిర్ పోర్టులలో కఠినమైన తనిఖీలను, ప్రవేశ నిరాకరణలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఒకసారి అధికారులు ఎంట్రీ ఆపితే, తాను నిర్దోషినని నిరూపించుకోవాల్సిన పూర్తి బాధ్యత కూడా సదరు పౌరుడిపైనే పడుతుంది.

